మున్సిపల్ ఎన్నికల తరువాత ప్రభుత్వంలో పెనుమార్పులు?

January 07, 2020


img

మున్సిపల్ ఎన్నికల తరువాత తెరాస సర్కార్‌లో పెనుమార్పులు జరుగబోతున్నాయా? అంటే సిఎం కేసీఆర్‌, మంత్రులు, తెరాస నేతల మాటలను వింటే అవుననే అనిపిస్తుంది. 

తాను కలలుగన్న తెలంగాణ సాకారమైందని, ఇంతకంటే తనకు ఏమి కావాలని సిఎం కేసీఆర్‌ తన సన్నిహితులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. అంటే ఇక తాను సిఎం పదవిలో నుంచి తప్పుకోవాలనుకొంటున్నట్లు కేసీఆర్‌ సూచిస్తున్నట్లు భావించవచ్చు. ఆయన తప్పుకొంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనే ప్రశ్నకు సమాధానం ప్రజలందరికీ తెలుసు. అయినా మంత్రులు, తెరాస నేతలు ఒకరి తరువాత మరొకరి ‘కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారన్నట్లు’ మాట్లాడి సందేహాలకు తావు లేకుండా చేశారు. 

కేసీఆర్‌ సిఎం పదవి నుంచి తప్పుకొంటే ఏమి చేస్తారు?అనే ప్రశ్నకు మజ్లీస్ పార్టీ సమాధానం చెపుతోంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తున్న మజ్లీస్ పార్టీకి సిఎం కేసీఆర్‌ సంఘీభావం తెలుపుతున్న సంగతి తెలిసిందే. అందుకే రాష్ట్రంలో దాని సభలు, ఆందోళన కార్యక్రమాలకు అనుమతిస్తున్నారు. కనుక కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసిన తరువాత కేసీఆర్‌ మజ్లీస్, దేశంలోని బిజెపియేతర పార్టీలతో కలిసి జాతీయస్థాయిలో పోరాటాలు ప్రారంభించవచ్చు. 

సిఎం కేసీఆర్‌ ఫిబ్రవరిలో యాదాద్రిలో మహాసుధర్శన యాగం చేయనున్నారు. సిఎం కేసీఆర్‌ ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకొన్నప్పుడు అటువంటి యాగాలు చేస్తుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. అప్పటికి మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తవుతాయి. కనుక కేటీఆర్‌కు పట్టాభిషేకం జరుగడం ఖాయంగానే కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్ధులను గెలిపించే బాధ్యత మంత్రులదేనని, ఎన్నికలలో సత్ఫలితాలు సాధించలేని మంత్రులపై వేటు వేస్తానని సిఎం కేసీఆర్‌ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అంటే దానార్ధం కేటీఆర్‌ తనకు నచ్చినవారిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం కూడా ఉందని భావించవచ్చు. ఈ ఊహాగానాలు నిజమా కాదో మరో నెలరోజుల్లో తేలిపోతాయి. కనుక అంతవరకు అందరూ వేచి చూడాల్సిందే.


Related Post