మోత్కుపల్లి ఒడ్డున పడినట్లేనా?

January 07, 2020


img

మోత్కుపల్లి నర్సింహులు పరిచయమే అవసరంలేని ప్రముఖ రాజకీయ నాయకుడు. ఒకప్పుడు టిడిపిలో ఉన్నప్పుడు ఆయన తెరాసను గట్టిగా డ్డీకొంటూ బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. కానీ అంత బలమైన నాయకుడికి దురదృష్టం వెంటాడటంతో రాజకీయ జీవితం దాదాపు సమాప్తం అయిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో టిడిపి ఓడిపోవడం, గవర్నర్‌ పదవి ఇప్పిస్తానని చంద్రబాబునాయుడు మాటలు నమ్మి 3-4 ఏళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండటం, టిడిపిని తెరాసలో కలిపేయాలని నోరుజారి పార్టీ నుంచి బహిష్కరించబడటం, 2018 ముందస్తు ఎన్నికలలో ఆలేరు నుంచి పోటీ చేసి ఓడిపోవడం....వంటివన్నీ ఆయన రాజకీయ జీవితాన్ని కోలుకోలేనివిధంగా దెబ్బ తీశాయని చెప్పవచ్చు. దాంతో రాజకీయ చౌరాస్తాలో నిలబడి ఎటుపోవాలో తెలియక దిక్కులు చూస్తున్న సమయంలో అదృష్టం బిజెపి రూపంలో ఆయన తలుపు తట్టింది. 

రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో ఆ పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు మోత్కుపల్లి నర్సింహులు శక్తిసామర్ధ్యాలను గుర్తించి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.  సరిగ్గా అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న మోత్కుపల్లి నర్సింహులు వెంటనే వారి ఆహ్వానాన్ని అంగీకరించారు. 

మోత్కుపల్లి నర్సింహులు సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి డిల్లీ వెళ్ళారు. ఈరోజు ఉదయం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో మోత్కుపల్లి బిజెపిలో చేరారు. దీంతో ఆయన రాజకీయ జీవితం మళ్ళీ గాడిన పడినట్లే భావించవచ్చు. అంతేకాదు... తెరాసకు మళ్ళీ ఆయన కొరకరాని కొయ్యగా మారే అవకాశం కూడా ఉంది. సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆయన బిజెపిలో చేరుతున్నారు కనుక రాష్ట్రానికి తిరిగిరాగానే తెరాసపై యుద్దం ప్రారంభించడం ఖాయం.


Related Post