హరీష్‌రావు అలా చెప్పొచ్చా?

January 06, 2020


img

రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు చాలా చక్కగా ఆచితూచి మాట్లాడుతారని మంచి పేరుంది. మున్సిపల్ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించడం ఖాయమని చెపుతూ, “కాంగ్రెస్‌, బిజెపిల వలన రాష్ట్రానికి... ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఒకేఒక్క ఎమ్మెల్యే ఉన్న బిజెపి ప్రజలకు ఏమి చేయగలదు? ఎన్నికలలో డబ్బులు, మందుసీసాలు పంచిపెట్టి గెలవాలనుకొనే కాంగ్రెస్ పార్టీకి గానీ ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళు మళ్ళీ ఎన్నికల వరకు మీకు కనబడరు. కనుక అధికార పార్టీని కాదని వాటికి ఓట్లు వేస్తే అవి మురిగిపోయినట్లే. ఈసారి టికెట్లు లభించనివారు రెబెల్ అభ్యర్ధులుగా పోటీ చేసి గెలిచినప్పటికీ పార్టీలోకి తీసుకోబోము,” అని చెప్పారు. 

ప్రజలు అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే ఓట్లు వేయాలనుకొంటే ఇక ఎన్నికలు ఎందుకు?ఈ అనవసరపు ఖర్చు ఎందుకు?ఎన్నికలు నిర్వహించకుండా అన్ని పదవులకు నేరుగా ప్రభుత్వమే నామినేట్ చేసేసుకొంటే సరిపోతుంది కదా?ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. 

అధికార పార్టీని కాదని ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తే ‘పనులు కావని’ హరీష్‌రావు చెప్పడం కూడా సరికాదనే చెప్పాలి. ఆ లెక్కన కేంద్రప్రభుత్వం కూడా బిజెపియేతర ప్రభుత్వాలకు నిధులు విడుదల చేయకుండా, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించకుండా ఉంటే రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? 

మున్సిపల్ ఎన్నికలలో తెరాసను గెలిపించమని ప్రజలను కోరవచ్చు కానీ ప్రతిపక్షాలకు ఓట్లు వేసి గెలిపించడం వృధా అనే వాదనే సరికాదు. 

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ప్రాతిపాదికగా కేంద్రప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని వాదిస్తున్న తెరాస సర్కార్‌ అదేవిదంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు కూడా అభివృద్ధి ప్రాతిపదికగా నిధులు, సహకారం అందించవలసి ఉంటుంది.


Related Post