ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి వరాలు ఇవ్వడమేమిటని ఆశ్చర్యపోవద్దు. ఏపీ విషయంలో ఆయన తీసుకొంటున్న నిర్ణయాలతో ప్రస్తుతం ఏపీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి వరంగా మారాయని చెప్పవచ్చు. ఆయన వలన తెలంగాణకు ఎంతో కొంత మేలు కలుగుతోందని చెప్పక తప్పదు. అది ఏవిధంగా అంటే..
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రాజధాని అమరావతికి కొంత రూపురేఖలు తీసుకురాగలిగింది. గతంలో ఆయన హైదరాబాద్ ఐటి రంగాన్ని అభివృద్ధి చేసి చూపారు కనుక అమరావతిని కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేసి చూపుతారనే నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు తరలివచ్చాయి. మరికొన్ని రావడానికి సిద్దపడ్డాయి.
చంద్రబాబు స్థానంలో యువకుడైన జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారని అందరూ ఆశించారు. కానీ రాజకీయ కారణాలతో గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలన్నిటినీ జగన్ సర్కార్ పక్కన పెడుతుండటం, రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయించడంతో ఏపిలో ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది.
పైగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులతో సంబందంలేనట్లు రోజుకో సంక్షేమ పధకం, రోజుకో వర్గం ప్రజలకు భారీగా వరాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న ఏపీ, ఆ వరాలతో పూర్తిగా దివాళా స్థితికి చేరుకొనే ప్రమాదం ఉంటుందని ఆ వరాలు పొందుతున్న సామాన్య ప్రజలే ఆందోళన చెందుతున్నారు. ఇక వందలు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేవారికి ఇవన్నీ తెలియవా? అందుకే రాష్ట్రానికి రావాలనుకొన్న పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఆంధ్రావైపు చూసేందుకే భయపడుతున్నాయిప్పుడు. కనుక వారందరూ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి సాధిస్తూ మంచి రాయితీలు అందిస్తున్న తెలంగాణ వైపు వెళ్లిపోతున్నారు.
రాజధాని తరలించాలనే నిర్ణయంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. దాంతో అమరావతిలో భూములు కొన్నవారు తీవ్రంగా నష్టపోతున్నారు. అదే సమయంలో విశాఖలో రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకొన్నప్పటికీ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని కారణంగా ఎవరూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సాహసించడం లేదు. దాంతో ఇంతవరకు అమరావతిని నమ్ముకొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు విశాఖకు వెళ్ళే ఆలోచన చేయకుండా మళ్ళీ హైదరాబాద్, తెలంగాణ జిల్లాల వైపు తరలిపోతున్నారు. కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రాజకీయకక్ష సాధింపు చర్యల కారణంగా తెలంగాణవైపు తరలిపోతున్నారు.
ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇటువంటి అనిశ్చిత పరిస్థితులే నెలకొన్నప్పుడు విశాఖకు తరలిపోవాలని భావించి అక్కడ భారీగా భూములు కొన్న సినీప్రముఖులు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం చూసి ఇప్పుడు అటువంటి ఆలోచనలు చేయడం పూర్తిగా మానుకొన్నారు.
సిఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం కలిగి ఉండటం, రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పాలసీలు, రాయితీలు ఇస్తుండటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం నెంబర్: 1 స్థానంలో నిలుస్తుండటంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం ఆంధ్రాలో నెలకొన్న ఈ అనిశ్చిత పరిస్థితులు బోనస్‌గా కలిసివచ్చాయని చెప్పవచ్చు. ఆ బోనస్ ఇస్తోంది జగనన్నే అని వేరే చెప్పక్కరలేదు.