వరంగల్‌లో సైయెంట్, టెక్ మహీంద్ర నేడు ప్రారంభోత్సవం

January 06, 2020


img

హైదరాబాద్‌కు ధీటుగా రాష్ట్రంలో ద్వితీయశ్రేణి నగరాలను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే వరంగల్‌ అర్బన్ జిల్లా మడికొండలో ఐటి పార్క్‌ ఏర్పాటయింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో దేశవిదేశాలకు చెందిన పలు ఐటి కంపెనీలు అక్కడ ఏర్పాటవుతున్నాయి. ముందుగా టెక్ మహీంద్రా, సైయెంట్ కంపెనీలు నేడు ప్రారంభం కాబోతున్నాయి. 

టెక్ మహీంద్రా సంస్థకు ప్రభుత్వం ఇంకా భూములు కేటాయించవలసి ఉంది కనుక వరంగల్‌ ఐ‌టి పార్క్‌లోగల ఇంక్యూబేషన్ సెంటరులో తాత్కాలికంగా తన కార్యాలయం ఏర్పాటు చేసుకొని నేటి నుంచి పనులు మొదలుపెట్టబోతోంది. ప్రస్తుతం దీనిలో 100కు పైగా ఉద్యోగులు పనిచేస్తారు. శాశ్విత భవనాలు నిర్మించుకొన్న తరువాత పూర్తిస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసుకొంటుంది.    


సైయెంట్ కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో రూ.25 కోట్ల వ్యయంతో మూడంతుస్తులలో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత భవనం నిర్మించుకొంది. దానిలో ఇప్పటికే ఇంక్యూబేషన్ సెంటరులో 100 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. త్వరలోనే మరో 900 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని, తరువాత దశలో మరో 900 మందిని భర్తీ చేసుకోబోతున్నామని సైయెంట్‌ అధిపతి బీవీఆర్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.

ఈ ఐ‌టి కంపెనీల వలన ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడమే కాకుండా పరోక్షంగా అనేకమందికి ఉపాది, వ్యాపారావకాశాలు పెరుగుతాయని హైదరాబాద్‌ ఐ‌టి పరిశ్రమలను చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ట్రాన్స్ పోర్ట్, ఫుడ్ బిజినెస్, ఐ‌టి శిక్షణా సంస్థలకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. అలాగే ఐ‌టి సంస్థలకు వివిద రకాల సేవలు అందజేసేవారికీ ఉపాది అవకాశాలు లభిస్తాయి. ఇప్పటి వరకు వరంగల్‌ చుట్టుపక్కల జిల్లాలలో యువత ఐ‌టి రంగంలో ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వెళ్ళవలసి వస్తోంది. ఇకపై వారు హాయిగా తమ నగరంలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు. 

రాష్ట్రంలో 5 జిల్లాలలో ఐ‌టి పార్కులు కూడా ప్రారంభమైతే ఆ జిల్లాలు కూడా ఇదేవిధంగా హైదరాబాద్‌కు ధీటుగా ఎదగడం ఖాయం. ఇప్పటికే రాష్ట్రంలో పలుజిల్లాలలో సాగునీరు అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు మొదలయ్యాయి. ఇప్పుడు జిల్లాలకు ఐ‌టి కంపెనీలు కూడా తరలివస్తే తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారిపోవడం తధ్యం.


Related Post