హైదరాబాద్‌లో భారీ ర్యాలీ.. ట్రాఫిక్ జామ్‌

January 04, 2020


img

శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో హటాత్తుగా వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎన్నార్సీ) లకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. మామూలుగానే సాయంత్రం సమయంలో హైదరాబాద్‌ రోడ్లు వాహనాలతో కిక్కిరిసి ఉంటాయి. ఒకేసారి వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించడంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌ అయిపోయింది. 

హైకోర్టు ఆదేశాల మేరకు ధర్నాచౌక్ వద్ద 1,000 మంది మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరసన సభ నిర్వహించుకోవడానికి అనుమతిచ్చామని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పి.విశ్వప్రసాద్ తెలిపారు. కానీ సుమారు 10-20,000 మందికి పైగా ఆందోళనకారులు చేరుకోవడంతో ధర్నా చౌక్ వెనుకనున్న ఎన్టీఆర్ మైదానంలోకి వారిని అనుమతించారు. ఆందోళనకారులు ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తక్షణమే సీఏఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.

ఆందోళనకారులు ధర్నా చౌక్ వద్ద సభతో ఆగకుండా ట్యాంక్ బండ్ వైపు కదలడంతో ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ఎల్బీ స్టేడియం, మోహిదీపట్నం, అబీడ్స్, రాణీగంజ్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఛార్మినార్, పత్తర్‌ఘటీ ప్రాంతాలలో మధ్యాహ్నం నుంచే దుకాణాలు మూసివేశారు. అంటే ఆందోళనకారులు ముందుగా కూడబలుక్కొనే ఈ ర్యాలీ నిర్వహించారు తప్ప యాదృచ్చికంగా జరిగింది కాదని అర్ధమవుతోంది. 

ఒకేసారి వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి రావడంతో వారిని నియంత్రించలేక ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌లోపల కూర్చొని సత్యాగ్రహ దీక్ష చేసుకోవడానికే అనుమతించని పోలీసులు ఇన్నివేలమందిని ఏవిధంగా అనుమతించారో? వేలాదిమందిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు ఒకవేళ రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడి ఉంటే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరం అల్లకల్లోల్లమైపోయేది.


Related Post