మళ్ళీ సర్వే ముచ్చట్లు షురూ

January 04, 2020


img

శనివారం మధ్యాహ్నం నుంచి ప్రగతి భవన్‌లో తెరాస విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. సిఎం కేసీఆర్‌ తెరాస నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలలో 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలువబోతున్నాము. అలాగని అతివిశ్వాసం పనికిరాదు.  పార్టీలో అందరూ సమన్వయంతో పనిచేసి మన అభ్యర్ధులను గెలిపించుకొనేందుకు గట్టిగా కృషి చేయాలి. అవసరమైతే మంత్రులు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొంటారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గం స్థాయిలో పార్టీలో పాత, కొత్తవారిని కలుపుకుపోవాలి. బిజెపితో సహా మనకు ఎవరితోనూ పోటీ లేదు,” అని అన్నారు. 

రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలొచ్చినా సిఎం కేసీఆర్‌ మొట్టమొదట చెప్పే మాట సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని. చాలాసార్లు ఆ సర్వేలు నిజమయ్యాయి కానీ లోక్‌సభ ఎన్నికలలో మాత్రం బాగా బెడిసికొట్టాయి. వాటిలో ఆయన సర్వేలు, అంచనాలు తప్పడమే కాకుండా జాతీయరాజకీయాలలో చక్రం తిప్పాలనే కోరికను కూడా అటకెక్కించవలసివచ్చింది. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. 

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను బట్టి చూస్తే మున్సిపల్ ఎన్నికలలో తెరాస మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుచుకోవడం తధ్యంగానే కనిపిస్తోంది. కానీ పిసిసి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు తమతమ జిల్లాలలో అత్యధిక స్థానాలు గెలిపించుకొని అధిష్టానానికి తమ సత్తా చాటుకోవాలని పట్టుదలగా ఉన్నారు. కనుక వారి జిల్లాలలో తెరాసకు గట్టి పోటీ ఎదుర్కోవలసిరావచ్చు.


Related Post