జీహెచ్‌ఎంసీ ప్రయోగం ఫలిస్తుందా?

January 04, 2020


img

జీహెచ్‌ఎంసీ ఓ కొత్త ప్రయోగానికి సిద్దమవుతోంది. హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వారి సౌకర్యార్ధం అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ రోడ్డుపైన వరుసగా కొన్ని ఫుడ్‌స్టాల్స్ ను ఏర్పాటుచేయబోతోంది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న కొంతమంది నిరుద్యోగయువతను ఎంపిక చేసి వారికి వంటలలో శిక్షణ ఇస్తోంది. వారు జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణలో నాణ్యమైన, రుచికరమైన రకరకాల ఆహార పదార్ధాలు తయారుచేస్తారు. వారి కోసం జీహెచ్‌ఎంసీ ఇప్పటికే చిన్న చిన్న దుకాణాలు తయారుచేయించి అండర్ పాస్ రోడ్డుపక్కన వరుసగా అమర్చింది. వాటితో పాటు కుర్చీలు, గ్యాస్ స్టౌలు, పాత్రలు వగైరా కూడా అందించబోతోంది. ఈ స్టాల్స్ ఉదయం 6గంటల నుంచి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయి. వాటిలో అన్నిరకాల టిఫిన్స్ వగైరా లభిస్తాయి. మరొక రెండు వారాలలోగా ఈ స్టాల్స్ ప్రారంభించబోతున్నామని శేరిలింగంపల్లి జోన్ అదనపు కమీషనర్ దాసరి హరిచందన తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే హైదరాబాద్‌ నగరంలో మరిన్ని ప్రదేశాలలో ఇటువంటి రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. 

ఇది మంచి ఆలోచనే కానీ స్టాల్స్ నిర్వాహకులకు మంచి పట్టుదల, కష్టపడేగుణం, ఆహారపదార్ధాల తయారీలో నైపుణ్యం పెంపొందించుకోవడం చాలా అవసరం. అలాగే ఇవి జీహెచ్‌ఎంసీ అధ్వర్యంలో నడుస్తున్నాయి కనుక జీహెచ్‌ఎంసీ సిబ్బంది వచ్చి రోజూ అక్కడ ఫ్రీగా తినాలనుకున్నా ఇబ్బందే. ఆహార పదార్ధాల తయారీకి అవసరమైన బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయాలు రోజూ సమకూర్చుకోవడం కూడా చాలా పెద్ద ప్రక్రియే. కనుక జీహెచ్‌ఎంసీ సిబ్బంది, స్టాల్స్ నిర్వాహకులు కలిసికట్టుగా మంచి సమన్వయంతో పనిచేయగలిగినప్పుడే ఈ ప్రయోగం విజయవంతం అవుతుంది. కానీ ఈ ప్రయోగం విజయవంతమైతే మున్ముందు జీహెచ్‌ఎంసీ ద్వారానే అనేక వందలమందికి ఉపాది అవకాశాలు లభిస్తాయి. 


Related Post