అమెరికా అధ్యక్ష పదవి కోసం ఇరాక్ ప్రజలను బలి తీసుకోవాలా?

January 04, 2020


img

ఇరాక్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట అమెరికా దళాలు చేసిన దాడిలో ఇరాక్ క్వాడ్స్ ఫోర్స్ ఛీఫ్ జనరల్ ఖాసీం సోలేమన్‌తో సహా 8 మంది మృతి చెందారు. మళ్ళీ ఇవాళ్ళ ఉదయం ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఉత్తర ప్రాంతంలో ఓ సైనిక కాన్వాయ్‌పై దాడి జరిగింది. దానిలో ఆరుగురు చనిపోయినట్లు సమాచారం. ఇది కూడా అమెరికా దాడేనని ఇరాన్, ఇరాక్ దేశాలు వాదిస్తున్నాయి. అయితే అమెరికా వారి ఆరోపణలను ఖండించింది. ఈసారి తాము దాడి చేయలేదని ప్రకటించింది. ఈ వరుస దాడులపై ఇరాన్, ఇరాక్ దేశాలు అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా దురహంకారంతో వ్యవహరిస్తున్నారని, తమ దేశంలో విచ్చలవిడిగా దాడులు చేస్తూ తమ దేశాల సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్నారని ఈ దాడులను గట్టిగా తిప్పికొడతామని హెచ్చరిస్తున్నాయి. ఈరోజు జరిగిన దాడితో ఆమెరికాకు సంబందం ఉందో లేదో ఇంకా తెలియదు కానీ దీనితో పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నెలకొంది. 

అమెరికా స్వీయరక్షణ కోసమే దాడి చేసి ఖాసీం సోలేమన్‌తో సహా 8 మందిని హతమార్చామని అమెరికా చెపుకొంది. అయితే ఈ ఏడాది నవంబరులో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అప్పుడే ప్రచారం మొదలైంది కనుక దేశ ప్రజలను ఆకట్టుకొనేందుకే డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

సులేమాన్ తదితరులు అమెరికాపై ప్రత్యక్షంగా దాడికి పూనుకొంటే వారిపై ఎదురుదాడి చేయడం స్వీయరక్షణ అవుతుంది. కానీ ఇరాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై ఇటీవల జరిగిన దాడులలో ఖాసీం సోలేమన్‌తో సహా మృతుల ప్రమేయం ఉందని, వారు భవిష్యత్‌లో విదేశాలలో ఉన్న అమెరికా అధికారులపై కూడా దాడులు చేయడానికి కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలతో అమెరికా దాడులు చేయడం చూస్తుంటే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే చేస్తున్నట్లు అనుమానించవలసివస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగితే వాటికి ఇరాన్, ఇరాక్ ప్రజల ప్రాణాలు బలిగొనడం చాలా దారుణం. 

అమెరికాకు అగ్రరాజ్యమనే అహంభావం నిలువెల్లా ఉంది కనుకనే ఏదో వంకతో ఇతరదేశాలలో దాని సైన్యాలు తిష్టవేయడం, వాటి అంతర్గత వ్యవహారాలలో వేలుపెడుతుండటం, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా ఈవిధంగా దాడులు చేస్తుండటం పరిపాటిగా మారింది. 

ఒకవేళ భారత్‌ కూడా అమెరికా పద్దతినే పాటిస్తూ స్వీయరక్షణ కోసం పాకిస్థాన్‌పైకి యుద్దవిమానాలు పంపించి అక్కడ తలదాచుకొంటున్న హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులపై దాడులు చేస్తే అమెరికా...ప్రపంచదేశాలు సమర్ధిస్తాయా? కాదని అందరికీ తెలుసు. భారత్‌ దళాలు కాశ్మీరులో వేర్పాటువాదులను నియంత్రించే ప్రయత్నం చేస్తేనే మానవహక్కుల ఉల్లంఘన జరిగిపోతోందని గగ్గోలు పెట్టేసే ప్రపంచదేశాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడవు? 


Related Post