అన్ని పార్టీల లక్ష్యం అదే...

January 04, 2020


img

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై అధికార, ప్రతిపక్షాలు పూర్తి భిన్నవాదనలు చేస్తుండటంతో దేశప్రజలలో వాటి గురించి అనుమానాలు, అపోహలు, భయాలు నెలకొన్నాయి. కనుక దేశవ్యాప్తంగా సీఏఏ అవగాహన సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలకు సీఏఏ చట్టం గురించి అవగాహన కల్పించి, వారి అపోహలను దూరం చేయడం ద్వారా దానిపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై ప్రజలలో భయాందోళనలు నెలకొన్నప్పుడు వాటిని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కనుక ఇది చాలా మంచి ఆలోచనే అని చెప్పవచ్చు. 

దానిలో భాగంగానే బిజెపి అధ్వర్యంలో నిన్న నిజామాబాద్‌లో సీఏఏ అవగాహన సభ నిర్వహించారు. ఆ సభలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ల గురించి ఎంపీ ధర్మపురి అర్వింద్ బాగానే వివరించారు. అయితే త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తుండటంతో కాంగ్రెస్‌, తెరాస, మజ్లీస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఇటువంటి సందర్భాలలో ఏ రాజకీయ నాయకుడైనా ఇలాగే మాట్లాడుతాడు. కనుక సీఏఏ వేదికను ధర్మపురి అరవింద్‌ రాజకీయాలకు వాడుకోవడం విచిత్రమేమీ కాదు. 

అయితే దేశంలో కాంగ్రెస్‌, బిజెపిలతో సహా అన్ని పార్టీలు తమ తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. రాజకీయాలు చేస్తున్నాయి తప్ప నిజంగా ఏ పార్టీకి వాటిపట్ల చిత్తశుద్ది లేదనే చెప్పక తప్పదు. 

ఇందుకు ఉదాహరణలుగా...పార్లమెంటులో సీఏఏకు వ్యతిరేకంగా ఓటువేసిన తెరాస ఒకపక్క మజ్లీస్ పోరాటాలకు సంఘీభావం తెలుపుతూనే ఇంతవరకు దానిపై తన వైఖరిని తెలియజేయకపోవడం, అసదుద్దీన్ ఓవైసీ సిఎం కేసీఆర్‌తో భేటీ అయిన తరువాత నిజామాబాద్‌ వెళ్ళి సభపెట్టి వాటిని వ్యతిరేకిస్తూ మాట్లాడటం, అది చూసి మజ్లీస్ పార్టీ ‘తమ అడ్డాలో’ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందని ధర్మపురి అరవింద్‌ భయపడటం, దానిని అడ్డుకొనేందుకు వెంటనే సభ పెట్టి కేసీఆర్‌, ఓవైసీలపై విమర్శలు గుప్పించడం, నిజామాబాద్‌ బిజెపిదేనని చెప్పుకోవడం వంటివన్నీ కనిపిస్తున్నాయి. 

బిజెపి దేశప్రజలలో చిచ్చు పెడుతోందని వాదిస్తున్న కాంగ్రెస్‌, తెరాస, మజ్లీస్ పార్టీలు ముస్లింలను ఆకట్టుకోవాలని తాపత్రయపడుతుంటే, ఆ మూడు పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనే వాదనతో బిజెపి హిందువులను ఆకట్టుకోవాలని ఆశ పడుతోంది. అన్ని పార్టీల అంతిమ లక్ష్యం ఒక్కటే. ఈ భిన్న వాదనలతో ఏదోవిధంగా ప్రజలను ఆకట్టుకొని మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు రాల్చుకోవడమే. దీనిని బట్టి రాజకీయ పార్టీల చిత్తశుద్ది ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. వాటిమద్య సాగుతున్న ఈ ఆధిపత్యపోరులో సామాన్య ప్రజలను కూడా అవి పావులుగా వాడుకొంటుంన్నాయి. కనుక ప్రజలే విజ్ఞతతో వ్యవహరించవలసిన అవసరముంది. లేకుంటే చివరికి దానికి ప్రజలే మూల్యం చెల్లించవలసివస్తుంది.


Related Post