ముఖ్యమంత్రి అయినా కోర్టు కేసులు తప్పడం లేదు!

January 03, 2020


img

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్‌మోహన్‌రెడ్డిని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌ను శాశిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డిని అక్రమాస్తుల కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్రాన్ని శాశిస్తున్న వారిరువురూ ప్రతీ శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టు ముందు హాజరు కావలసిరావడం ఎంత విచిత్రం? 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున జగన్, ఎంపీగా బిజీగా ఉన్నందున విజయసాయి రెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని తమ న్యాయవాదుల ద్వారా కోరారు. కానీ సిబిఐ కోర్టు వారి అభ్యర్ధనను నిర్ద్వందంగా తిరస్కరించింది. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వంలో ఏ పదవి చేపట్టన్నప్పటికీ కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చినట్లయితే సాక్షులను ప్రభావితం చేసినట్లవుతుందని, తద్వారా ఈ కేసులపై ప్రతికూలప్రభావం చూపుతుందని సిబిఐ న్యాయవాది వాదించారు. ఇప్పటికే వారిరువురూ పదిసార్లు మినహాయింపు పొందారని, ఇంకా మినహాయింపులు ఇవ్వడం సరికాదని వాదించారు. జగన్ హోదా మారింది కానీ కేసుల నేర స్వభావం అలాగే ఉందని కనుక వారిరువురూ తప్పనిసరిగా కోర్టు విచారణకు హాజరుకావలసిందేనని సిబిఐ న్యాయవాది వాదించారు. 

అయితే వారిరువురూ ఏనాడూ సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయలేదని, బెయిలు షరతులకు లోబడే వ్యవహరిస్తున్నారని వారి తరపు న్యాయవాదులు వాదించారు. 

ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత వచ్చే శుక్రవారం వారివురూ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 2009లో హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పరితపించారు. అనేక ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొంటూ ధైర్యం కోల్పోకుండా  10 ఏళ్ళు పట్టుదలగా పోరాడి చివరికి తన కల నెరవేర్చుకొన్నారు. కానీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కోర్టు కేసులు ఎదుర్కోక తప్పడంలేదు.


Related Post