కవితకు రాజ్యసభ సీటు ఖాయమేనా?

January 03, 2020


img

లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా ఓటమిపాలైన తెరాస మాజీ ఎంపీ కవితను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని ఊహాగానాలు వినిపించాయి కానీ అదీ జరుగలేదు. ఎంపీగా ఉన్నంతకాలం క్షణం తీరికలేకుండా గడిపిన ఆమె హటాత్తుగా ఖాళీ అయిపోయారు. పైగా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటుండటంతో ఆమె తన సొంత పనులు, కార్యక్రమాలలో మునిగిపోయారు. 

అయితే అటువంటి చురుకైన, సమర్ధురాలైన కవితను అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలోనూ ఉపయోగించుకోకుండా ఖాళీగా అట్టేబెట్టడం వలన తెరాసయే నష్టపోతుంది తప్ప ఆమె కాదనే చెప్పాలి. కానీ సిఎం కేసీఆర్‌ ఏదైనా చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకొంటారనే సంగతి అందరికీ తెలుసు. ఆమెను రాజ్యసభకు పంపించబోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయిప్పుడు. 

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి 11, తెలంగాణకు 7 రాజ్యసభ సీట్లు కేటాయించబడ్డాయి. వాటిలో తెలంగాణలో తెరాసకు ఐదుగురు, కాంగ్రెస్‌, బిజెపిలకు చెరొక సభ్యుడు ఉన్నారు. 

తెరాస నుంచి జోగినపల్లి సంతో్‌షకుమార్‌, బండా ప్రకాశ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌, బిజెపి నుంచి గరికపాటి మోహన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి కెవిపి రామచంద్రరావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 

ఏప్రిల్ 9న తెలంగాణలో ఇద్దరు, ఆంధ్రాలో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కె.కేశవరావు కూడా వారిలో ఒకరు. తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్ళినవారిలో  గరికపాటి, కేవీపీ రామచంద్రరావు కూడా అదే రోజున పదవీ విరమణ చేస్తారు. అంటే ఏప్రిల్ 9న తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నాయన్న మాట. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపిలకు తమ రాజ్యసభ సభ్యులను గెలిపించుకొనేందుకు తగినంతమంది ఎమ్మెల్యేలు లేనందున ఆ మూడు సీట్లు తెరాసకే దక్కుతాయి. 

వాటిలో ఒక సీటును కవితకు కేటాయించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మిగిలిన రెండు సీట్లకు తెరాసలో చాలా పోటీ ఉంది కనుక వాటిని ఎవరికిస్తారనే విషయం అప్రస్తుతం. కవితను రాజ్యసభకు పంపించడం ద్వారా మళ్ళీ పార్లమెంటులో తెరాస... తెలంగాణ ప్రజల గొంతును బలంగా వినిపించవచ్చునని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. మార్చి నాటికి దీనిపై పూర్తి స్పష్టత రావచ్చు.


Related Post