ఇష్టం లేకున్నా ప్రజాహితం కోసం కటిన నిర్ణయాలు: కేసీఆర్‌

January 02, 2020


img

గురువారం ప్రగతి భవన్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో కొన్నిసార్లు ఇష్టం లేకపోయిన ప్రజాహితం కోసం కటిన నిర్ణయాలు తీసుకోవలసివస్తోంది. నానాటికీ సమాజంలో నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. మనుషులు మృగాల్లా తయారవుతున్నారు. ఈ సామాజిక సమస్యను చట్టాలతో పరిష్కరించలేము. బాల్యం నుంచే పిల్లలలో నైతిక విలువలు పెంచగలిగితేనే సమాజంలో మార్పు సాధ్యం అవుతుంది. కనుక వచ్చే విద్యాసంవత్సరం నుంచి నైతిక విలువలను పెంపొందించే పాట్యాంశాలను ప్రవేశపెడతాము. వాటిని రూపొందించడంలో పోలీసులు, సామాజికవేత్తలు, మేధావులు, ఆధ్యాత్మికవేత్తల సలహాలు తీసుకొంటాము. దీనికోసం మాజీ డిజిపిలతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. రాష్ట్రంలో పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా సామాజిక రుగ్మతలను నివారించడంలో కూడా చాలా కృషి చేస్తున్నారు. హరితహారం వంటి సామాజిక కార్యక్రమాల అమలులో కూడా చాలా చొరవ చూపారు. ఇక ముందు కూడా పోలీసులు తెలంగాణ సమాజాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

55 రోజుల పాటు సుదీర్గంగా సాగిన ఆర్టీసీ సమ్మె సమయంలో సిఎం కేసీఆర్‌ చాలా కటినంగా వ్యవహరించినందుకు అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు కానీ చివరి వరకు చాలా నిబ్బరంగా తన వైఖరికే కట్టుబడి ఆర్టీసీని మళ్ళీ గాడిలో పెట్టడంతో అంతవరకు ఆయనను విమర్శించినవారు సైతం జేజేలు పలికేరు. 

హాజీపూర్, హన్మకొండ, దిశ వరుస హత్యాచారాలతో తెలంగాణ రాష్ట్రంలో ఒకరకమైన భయాందోళనలు పెరిగాయి. కానీ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో ప్రజలకు భరోసా కల్పించినట్లయింది. బహుశః ఈ రెండు ఘటనలను మనసులో ఉంచుకొని కటినంగా వ్యవహరించక తప్పలేదని సిఎం కేసీఆర్‌ అని ఉండవచ్చు.


Related Post