హైకోర్టు కేసులు: తాజా అప్‌డేట్స్

January 02, 2020


img

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తగినన్ని భద్రతాఏర్పాట్లు చేయలేదంటూ ఖాజా ఐజాజుద్దీన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఎగ్జిబిషన్‌ నిర్వహణకు అభ్యంతరాలు తెలుపకపోవడంతో జనవరి 1వ తేదీ నుంచి ఎగ్జిబిషన్‌ మొదలైంది. ఎగ్జిబిషన్‌లో సందర్శకులు, స్టాల్స్ నిర్వాహకుల భద్రత కోసం ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది. 

మున్సిపల్ ఎన్నికలుకు సంబందించి వార్డుల విభజన, రిజర్వేషన్లు వగైరాలు ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై అభ్యంతరం తెలుపుతూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.      

సచివాలయం కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్తది నిర్మించాలనుకొంటున్నారా? లేదా ఉన్న భవనాలకు అదనంగా కొత్త భవనాలు నిర్మించాలనుకొంటున్నారా? అయితే ఎంత విస్తీర్ణంలో...ఎంత ఖర్చుతో నిర్మించాలనుకొంటున్నారు?ఆర్ధికమాంద్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నప్పుడు ఇంత భారీ వ్యయాన్ని ఏవిధంగా తట్టుకోగలదు? కొత్త సచివాలయం నిర్మాణం పూర్తయ్యే వరకు సచివాలయంలో వివిద శాఖలను ఎక్కడ ఏర్పాటు చేస్తారు? దాని వలన పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తవా?అంటూ హైకోర్టు అనేక ప్రశ్నలు వేసింది. వీటన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరపు వాదించిన ఏఏజి రామచంద్ర రావును ఆదేశించింది.


Related Post