తెరాసలో కోరస్ పాడటం మొదలైందంటే...

January 02, 2020


img

సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాల గురించి గొప్పగా చెప్పుకొంటుంటారు. అది సహజమే. తప్పు కానే కాదు. అయితే కొన్నిసార్లు ప్రభుత్వాలు లేదా వాటిని నడిపించే పార్టీలు తమ ఆలోచనలను అమలుచేసే ముందు జనంనాడి తెలుసుకోవడానికో లేదా ప్రజలను మానసికంగా సిద్దం చేసేందుకో ముందుగా వాటి గురించి తమ మంత్రులు, నేతల చేత మాట్లాడింపజేస్తుంటాయి. ఉదాహరణకు కేసీఆర్‌ జాతీయరాజకీయాలలోకి వెళ్లాలనుకొంటునట్లు ముందుగా తెరాస నేతల ద్వారా జనాలకు తెలియజేశారు. ఆ తరువాత ఎన్నికల సమయంలో అదే విషయం కేసీఆర్‌ స్వయంగా దృవీకరించారు.  

కానీ కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళదలిస్తే ఆయనను ఆపేదెవరు? దాని గురించి ప్రజలకు ఆయన నచ్చజెప్పుకోవలసిన అవసరం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. నిజమే! కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళదలిస్తే ఆయనను ఎవరూ ఆపలేరు. ఆయనకు ప్రజలకు నచ్చజెప్పుకోవలసిన అవసరం లేదు కూడా. 

కానీ జాతీయరాజకీయాలలోకి వెళ్లదలిస్తే సిఎం పదవి ఎవరికి దక్కుతుంది? అనే చర్చ సర్వత్రా మొదలవుతుంది. కనుక దానికి కేటీఆరే అన్ని విధాలా తగినవాడనే వాదన ఇప్పటి నుంచే వినిపిస్తున్నట్లు భావించవచ్చు. నిజానికి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టదలిస్తే పార్టీలో.. ప్రభుత్వంలో ఎవరూ అభ్యంతరాలు చెప్పే సాహసం చేయ(లే)రు. కేటీఆర్‌ పట్ల ప్రజలలో కూడా మంచి అభిప్రాయమే ఉంది. కానీ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడం తధ్యం.

ఇప్పటికే కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ పదవులు కట్టబెట్టుకొని కుటుంబపాలన చేస్తున్నారని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే మరింత జోరుగా విమర్శించవచ్చు. వాటి వలన తెరాసకు, కేటీఆర్‌కు నష్టమేమీ ఉండదు కానీ ప్రతిపక్షాల విమర్శలు లేదా వాదనలను ప్రజలు పట్టించుకోకుండా ఉండాలంటే ముందుగా పార్టీలో అందరూ కోరస్ పాడటం అవసరమని తెరాస అధిష్టానం ఆలోచన కావచ్చు. బహుశః అందుకే తెరాసలో ఒకరి తరువాత ఒకరు కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే తప్పులేదు ఆ పదవికి కేసీఆర్‌ తరువాత ఆయనే అన్నివిధాలా అర్హుడు అనే పాత పాడటం మొదలుపెట్టారనుకోవచ్చు. కనుక త్వరలోనే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం, కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. లేకుంటే ఇప్పుడు ఈ ప్రస్తావన చేసి ఉండేవారే కాదు కదా?


Related Post