కేటీఆర్‌ సిఎం కావడం తధ్యం: కవిత

January 02, 2020


img

నిప్పు లేనిదే పొగ రాదనట్లే అధిష్టానం సూచనలు లేదా ఆదేశం లేనిదే తెరాస నేతలు ఏ ముఖ్యమైన విషయాలపై మాట్లాడరనే సంగతి అందరికీ తెలుసు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా ఆయన తరువాత ఎవరు? అని మాట్లాడటం సాహసమే అని చెప్పాలి. కానీ మాట్లాడుతున్నారంటే పార్టీ అధిష్టానం సూచనల మేరకే మాట్లాడుతున్నారనుకోవలసి ఉంటుంది. 

కేసీఆరే మరో రెండు దశాబ్ధాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పుకొన్న తెరాస నేతలు ఇప్పుడు ఆయన తరువాత కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారంటూ చర్చ ప్రారంభించడం చాలా అసందర్భంగా ఉంది. కానీ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో పోరాడేందుకు సిఎం కేసీఆర్‌ జాతీయరాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కనుకనే తెరాస ఈ చర్చను ప్రారంభించి ఉండవచ్చు లేకుంటే తెరాస నేతలెవరూ ఇంత సాహసం చేసి ఉండేవారేకారు.     

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుగా ఈ అప్రస్తుత చర్చను మొదలుపెట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ చర్చను సమర్ధించలేదు...అలాగని వ్యతిరేకించలేదు! 

కనుక ‘కేసీఆర్‌ తరువాత కేటీఆర్‌’ అనే ఈ చర్చను తెరాస ఎంపీ మాలోత్ కవిత కొనసాగిస్తూ, “కేటీఆర్‌ పార్టీని సమర్ధంగా నడిపిస్తూనే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఎంతో సమర్ధంగా నిర్వర్తిస్తున్నారు. కనుక కేసీఆర్‌ తరువాత తెలంగాణ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి కానున్నారు,” అని అన్నారు. 

ఒకవేళ ఈ కొత్త చర్చ, వాదనలకు తెరాస అధిష్టానం ఆమోదంలేకపోయుంటే వాటిని ఖండించి ఉండేది లేదా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నవారిని మందలించి ఉండేది. కానీ రెండూ జరుగడం లేదు అంటే...?


Related Post