ఈటల వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశ్యించి చేసినవేనా?

January 02, 2020


img

మంత్రి ఈటల రాజేందర్‌ నిన్న హుజూరాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని తెరాస కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా దృష్టిలో ప్రజలు చాలా గొప్పవారు. ఈ పదవి వారు పెట్టిన భిక్షే తప్ప అమ్మానాన్నలు ఇచ్చింది కాదు. నేను మొదటి నుంచి ప్రజలనే నమ్ముకొన్నాను. వారి అండదండలు, ప్రేమాభిమానాలు నాకు పుష్కలంగా ఉన్నందునే పార్టీలో ఎంత పోటీ ఉన్నప్పటికీ పార్టీ టికెట్, మంత్రి పదవి నాకు లభిస్తున్నాయి. అయితే కొందరు నేతలు ఎన్నికలలో డబ్బు, మద్యం పంచి గెలవవచ్చని భావిస్తుంటారు. అటువంటివారు తాత్కాలికంగా పైచేయి సాధించవచ్చు కానీ చివరికి న్యాయం, ధర్మం, సత్యం నమ్ముకొన్నవారిదే అంతిమ విజయం లభిస్తుంది. గత ఎన్నికలలో నాతోనే కూడా ఉండి నాకు వెన్నుపోటు పొడిచినవారెవరో నాకు తెలుసు. నాకు క్యాంప్ రాజకీయాలు, గ్రూపులు కట్టడం ఇష్టం లేదు. కొందరు ఎన్నికలకు ముందు ఒకలాగా, గెలిచిన తరువాత మరొకవిధంగా వ్యవహరిస్తుంటారు. నేను అటువంటి వ్యక్తిని కానని నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. అందుకే నేను ధైర్యంగా మున్సిపల్ ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడుగ గలుగుతాను. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో కలిపి 60 కౌన్సిలర్ స్థానాలున్నాయి. కనుక తెరాస కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి 60 స్థానాలను గెలుచుకొనేందుకు గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

ఈటల రాజేందర్‌ మాటలలో పార్టీలో తనకు అన్యాయం జరుతోందనే ఆవేదన కనపడుతోంది. అయినప్పటికీ ప్రజల అండదండలతో నెగ్గుకొస్తున్నానని చెప్పకనే చెపుతున్నారు. కరీంనగర్‌లో ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్ మద్య కోల్డ్ వార్ నడుస్తోంది. కనుక గంగుల వర్గాన్ని ఉద్దేశ్యించే ఈటల ఈమాటలన్నారేమో? 


Related Post