కేటీఆర్‌ అలా ఎందుకన్నారో?

January 01, 2020


img

నూతన సంవత్సరం సందర్భంగా తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీనే మేము మా ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్నాము. కనుక దానిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయబోము. మజ్లీస్ పార్టీ మాకు మిత్రపక్షం మాత్రమే. దానితో కలిసి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు. రాజకీయాలలో ప్రత్యర్దులే తప్ప శత్రువులు ఉండరని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఒకప్పుడు అన్న కేటీఆర్‌ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయబోము...అదే మా ప్రధాన ప్రత్యర్ధి అని చెప్పడం ఆశ్చర్యకరమే. తెరాస ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేటికీ కాంగ్రెస్ పార్టీయే దానికి ప్రత్యామ్నాయమని అందరికీ తెలుసు. సీఏఏ,ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు, రాష్ట్రంలో తెరాస మిత్రపక్షం మజ్లీస్ పార్టీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలన్నిటినీ ఫెడరల్ ఫ్రంట్‌ ద్వారా ఒక్క తాటిపైకి తెచ్చి వాటికి కేసీఆర్‌ నాయకత్వం వహించి జాతీయరాజకీయాలలో ప్రవేశించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుపోతే తప్ప ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని గతంలోనే స్పష్టమైంది. కనుక కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యే ప్రయత్నంలోనే కేటీఆర్‌ ఈవిధంగా అని ఉండవచ్చు. రాజకీయాలలో ప్రత్యర్దులే తప్ప శత్రువులు ఉండరనే కేటీఆర్ మాటలకు అర్ధం ఆదేనేమో?   

అలాగే తెరాస-మజ్లీస్ పార్టీల దోస్తీ గురించి అందరికీ తెలుసు. అయితే అవి ఎన్నికలలో పరస్పరం సహకరించుకొన్నాయే తప్ప కలిసి పోటీ చేయలేదు కనుక కేటీఆర్‌ ఆదేమాట చెప్పారనుకోవచ్చు. కానీ మజ్లీస్ హైదరాబాద్‌ దాటి రాష్ట్రంలో ఇతర జిల్లాలో పోటీకి సిద్దపడినట్లయితే అవి వాటి దోస్తీని పణంగా పెట్టవలసి రావచ్చు లేదా కలిసి పోటీచేయక తప్పనిసరి అవుతుంది. కానీ మజ్లీస్ అధినేతలకు అటువంటి ఆలోచనలు చేయకుండా ఉండేందుకే సిఎం కేసీఆర్‌ వారికి అత్యంత గౌరవం ప్రాధాన్యత ఇస్తున్నారనుకోవచ్చు. కానీ ఇంకా ఎంతకాలం మజ్లీస్ నేతలు గిరిగీసుకొని హైదరాబాద్‌కే పరిమితమవుతారో చూడాలి.


Related Post