రైతుబంధుపై మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన

December 31, 2019


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుబంధు పధకంలో ఎటువంటి భూపరిమితి విధించకుండా రాష్ట్రంలో వ్యవసాయ భూములున్న వారందరికీ దానిని వర్తింపజేస్తున్న సంగతి తెలిసిందే. దాని వలన అర్హులైన నిరుపేద రైతుల కంటే 50-100-200 ఎకరాలున్న భూస్వాములే ఎక్కువ లబ్ది పొందుతున్నారు. అటువంటి వారికి కూడా ఒక్కొకరికీ ఏడాదికి ఎకరానికి రూ.10,000 చొప్పున చెల్లిస్తున్నందున ప్రభుత్వంపై తీవ్ర ఆర్ధికభారం పడుతోంది. దాంతో నిజంగా రైతుబంధు సొమ్ము అవసరమున్న నిరుపేద రైతులకు సకాలంలో చెల్లించలేకపోతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో ఇంకా 6 శాతం మంది రైతులకు రైతుబంధు సొమ్ము చెల్లించవలసి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. కానీ వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. త్వరలోనే వారికీ రైతుబంధు నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

రైతుబంధు పధకం ముఖ్యోద్దేశ్యం రైతులు పంటలు వేసేముందు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు కనుక ప్రభుత్వమే వారికి ఆ సొమ్ము  ముందుగా అందజేసి ఆదుకోవాలని! కానీ ఖరీఫ్ సీజను పూర్తవుతున్నా ఇంకా 6 శాతం మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేయలేకపోవడంతో ఆ పధకం ప్రయోజనం నెరవేరడం లేదని అర్ధమవుతోంది. 

ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశ్యంతోనే ఈ పధకాన్ని ప్రారంభించింది. కానీ నిరుపేదరైతుల కోసం ఉద్దేశ్యించిన ఈ పధకాన్ని వందల ఎకరాలున్న భూస్వాములు, రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు,  సినీతారలకు కూడా వర్తింపజేయడంతో ప్రభుత్వంపై ఆర్ధికభారం పెరిగిపోయింది. వారికీ రైతుబంధు పధకం వర్తింపజేసి భారీగా డబ్బు అందజేస్తూ దానిని స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరుతోంది. కానీ అడగకుండానే వచ్చిపడుతున డబ్బును ఎవరు మాత్రం వదులుకొంటారు? అతికొద్ది మంది మాత్రమే వదులుకొన్నారు.

కనుక పేదరైతులకు మాత్రమే లబ్ది కలిగేలా ఈ పధకంలో భూపరిమితి విధించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు చేసింది. కానీ సిఎం కేసీఆర్‌ వాటిని తిరస్కరించినట్లుమంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కనుక ఈ పధకం యధాతధంగా కొనసాగిస్తామని, త్వరలోనే మిగిలిన రైతులకు బాకీలు చెల్లిస్తామని తెలిపారు. 

అప్పులు చేసి వ్యవసాయం చేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకొంటున్న కౌలురైతులకు ఈ పధకాన్ని వర్తింపజేయడానికి ససేమిరా అంటున్న సిఎం కేసీఆర్‌, ప్రభుత్వంపై తీవ్ర ఆర్ధికభారం పడుతున్నప్పటికీ రైతుబంధు సొమ్ములు అవసరమే లేని కోటీశ్వరులకు ఈ పధకాన్ని కొనసాగించాలనుకోవడం చాలా విడ్డూరంగానే ఉంది.


Related Post