నా కల నెరవేరుతోంది: సిఎం కేసీఆర్‌

December 30, 2019


img

సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ మిడ్‌మానేరు ప్రాజెక్టును చూసి వచ్చిన తరువాత తీగలపల్లిలో ఉత్తర తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను కలలుగన్న తెలంగాణ నా కళ్ళ ముందు కదలాడుతుంటే ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అనేక వాగులున్న కరీంనగర్‌ జిల్లాలో ఒకప్పుడు నీళ్ళ కరువుతో అల్లాడిపోయేది. అలాగే సిరిసిల్లాలో ఆకలి చావులు సర్వసాధారణ విషయంగా ఉండేది. ఆ కారణంగా ప్రజలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలసలు పోయేవారు. కానీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో పరిస్థితులు వేగంగా మారడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేయకుండా ముందుకే సాగుతూ కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించి రాష్ట్రానికి కావలసినన్ని నీళ్ళు నిలువచేసుకోగలిగాము. ఇప్పుడు మానేరు జలకళతో ఉట్టిపడుతోంది. ఇప్పటికే 50 టీఎంసీలు నీళ్ళు నింపుకొన్నాము. కావాలంటే మరో 60 టీఎంసీలు నీళ్ళు నింపుకోవచ్చు. అంటే వర్షాలతో సంబందం లేకుండా 365 రోజులు లోయర్, మిడ్‌మానేరులో జీవనదిలా నీళ్ళు పారుతుంటాయి కనుక ఇకపై జిల్లాలో రైతులు నిశ్చింతగా ఏడాదికి రెండు పంటలు వేసుకోవచ్చు. 

ఈ ప్రాజెక్టుల వలన జిల్లాలో భూగర్భజలాలు కూడా పెరిగినట్లు వార్తలు చూస్తున్నాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఎంతో తృప్తిగా అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్‌, బిజెపిలు ఎన్నోవిమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల నేతలకు జిల్లా భౌగోళిక పరిస్థితి గురించి కనీస అవగాహన లేదు. సాంకేతిక విషయ పరిజ్ఞానం అసలే లేదు. కానీ ఎన్నో వెకిలి మాటలు మాట్లాడారు. కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇంకా ఎన్నో అవరోధాలు సృష్టించారు. ఇప్పుడు వారి కళ్లెదుట నిండుగా పారుతున్న ఈ నీళ్ళే వారి విమర్శలకు సమాధానం చెపుతాయి. అయితే ఇక్కడితో ఈ పని పూర్తయిపోలేదు. కరీంనగర్‌ జిల్లాలో ఉన్న 46 వాగులలో పారే నీటిని కూడా ఒడిసిపట్టి వినియోగించుకోవాలి. అందుకోసం వాటిపై 210 చెక్ డ్యాములు నిర్మిస్తాము. కరీంనగర్‌ నుంచి సూర్యాపేట వరకు 365 రోజులు నీళ్ళు పారుతుండాలి. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాను. వచ్చే ఏడాది ఇదే సమయానికి జిల్లాలో ఎంతమార్పు వస్తుందో మీరే చూస్తారు,” అని అన్నారు.


Related Post