భారత్‌ ధర్మసత్రం కాదు: బిజెపి

December 30, 2019


img

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనలపై బిజెపి అధికార ప్రతినిధి ఎం. రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. 

ఆదివారం కొంపల్లిలో బిజెపి కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “మన దేశమేమైనా ధర్మసత్రమా...ఎవరు పడితే వారు వచ్చి పోతుండటానికి?మన వీధిలోకి కొత్త వ్యక్తి వస్తేనే అతను ఎవరో ఎందుకు వచ్చారో తెలుసుకొంటాము. అటువంటిది విదేశాల నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్నవారి గురించి అడిగితే తప్పా?వారి వివరాలు అడిగితే మద్యలో కొందరు ఎందుకు భుజాలు తడుముకొంటున్నారు? దేశభద్రతకు సంబందించిన ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాద్దాంతం చేస్తోంది? సీఏఏ చట్టంలో అసలు ఏముందో కూడా తెలుసుకోకుండా దానిపై ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? దాని వలన భారతీయులెవరికీ ఎటువంటి ఇబ్బందీ కలుగదని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు చెపుతున్నా సీఏఏ పేరు చెప్పి కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి,” అని అన్నారు. 

 సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో ఇప్పటికే ఆర్ధికమాంద్యంతో ఇబ్బంది పడుతున్న భారత్‌కు ఇంకా నష్టం చేస్తుందనే సంగతి రాజకీయపార్టీలు, ఆందోళనకారులు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించడం చాలా అవసరం. అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వీటితో చెలగాటమాడితే చివరికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లించవలసి ఉంటుంది కనుక ప్రజలు కూడా వీటికి దూరంగా ఉండటం మంచిది. అప్పుడు అధికార, ప్రతిపక్షాలే ఈ సమస్యను రాజకీయంగా తేల్చుకొంటాయి. 


Related Post