రాజధానా...రియల్ ఎస్టేట్ వ్యాపారమా?

December 30, 2019


img

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టిడిపి అమరావతిని రాజధానిగా నిర్ణయించి అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. కానీ ఏపీ ప్రజలు టిడిపిని తిరస్కరించి వైసీపీని ఎన్నుకొన్నారు. దాంతో కధ మళ్ళీ మొదటికొచ్చింది. రాజధాని ఎక్కడ పెట్టాలి? దానిలో లాభనష్టాలు ఏమిటి? అని తేల్చేందుకు ప్రభుత్వం రెండు కమిటీలు వేస్తే వాటిలో ఒకటి నివేదిక ఇచ్చింది. రెండవది కూడా త్వరలోనే నివేదిక ఇస్తుంది. 

కొన్ని సందర్భాలలో నిపుణుల కమిటీలు ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే నివేదికలు తయారుచేసి ఇస్తుంటాయి. కనుక వాటిని లాంఛనప్రాయంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదిస్తుంటారు. అమరావతి విషయంలో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో చెప్పిందే జిఎన్ రావు కమిటీ చెప్పడమే అందుకు తాజా ఉదాహరణ. కానీ రాజధాని తరలింపుపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా అమరావతి రైతుల తీవ్ర వ్యతిరేకత, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో భిన్నాభిప్రాయాలను చూసిన తరువాత ప్రభుత్వం కొంచెం వెనకడుగు వేసినట్లుంది. అందుకే నిపుణుల కమిటీ నివేదికపై అధ్యయనం కోసం అంటూ మళ్ళీ మరో హైపవర్ కమిటీని వేసింది.  

చేతులారా సృష్టించుకొన్న ఈ సమస్యపై ప్రభుత్వం పునరాలోచించుకోవడానికి మరికొంత సమయం పొందేందుకే హైపవర్ కమిటీకి 3 వారాల గడువు పెట్టిందనుకోవచ్చు. రెండు నిపుణుల కమిటీల నివేదికలపై అధ్యయనం చేసి 3 వారాలలోగా తగిన సిఫార్సులు చేయాలని ప్రభుత్వం హైపవర్ కమిటీని కోరింది.

రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేక విశాఖకు తరలిస్తారా అనేది తెలియకపోయినా రాజధాని తరలింపు వార్తలతో అమరావతిలో భూముల ధరలు నానాటికీ పడిపోతుంటే, కర్నూలు, విశాఖలో భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. దాంతో అమరావతిలో రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అక్కడ బారీగా భూములు కొన్నవారు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు, విశాఖలోవారు పండగ చేసుకొంటున్నారు. 


Related Post