అభివృద్ధి..ఉద్యోగ కల్పనలే ప్రభుత్వాలకు గీటురాయి

December 30, 2019


img

తెలంగాణ ఐ‌టి మరియు పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ‘ఆస్క్ కేటీఆర్‌’ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

మతతత్వ రాజకీయాలు చేస్తున్న బిజెపి, మజ్లీస్ పార్టీలను తెరాస ఏవిధంగా ఎదుర్కొంటుంది? అనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం చెపుతూ, “దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రం. ఇది ఎప్పటికీ ప్రశాంతంగా ఉండేవిధంగా మా పాలన ఉంటుంది. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారు. విభజన రాజకీయాలు చేయాలనుకొనేవారిని దూరంగా ఉంచుతారు,” అని చెప్పారు. 

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుచేస్తుందా లేదా? అనే ప్రశ్నకు సమాధానంగా, “దీనిని వ్యతిరేకించాలని మా పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధించిన నెటిజన్లు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. దీని అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు. 

మరో ప్రశ్నకు సమాధానంగా “నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఏవో మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే అవి తాత్కాలికంగానే పనిచేస్తాయి తప్ప ఎప్పటికీ కాదు. దేశంలో ఏ ప్రభుత్వ పాలనకైనా ఆర్ధికాభివృద్ధి, ఉద్యోగాల కల్పనే గీటురాయి అని భావిస్తున్నాను,” అని చెప్పారు.  

బిజెపి, మజ్లీస్ పార్టీలు రెండూ మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తుంటాయనేది బహిరంగ రహస్యం. ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపి హిందుత్వ అజెండాతో ముందుకు సాగుతున్నప్పటికీ తెలంగాణలో ప్రజలను దానితో ఆకట్టుకోలేమని గ్రహించిన బిజెపి నేతలు, తెరాస-మజ్లీస్ దోస్తీపై విమర్శలకే పరిమితమవుతుంటారు. కానీ ఎన్నికలప్పుడు మజ్లీస్ అధినేతలిద్దరి ప్రసంగాలు ఏవిధంగా ఉంటాయో అందరికీ తెలుసు. ప్రజల మద్య విద్వేషాలు రాజేసేవిధంగా ప్రసంగించినందుకు అక్బరుద్దీన్ ఓవైసీ ఓసారి జైలుకు కూడా వెళ్ళివచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ తెరాసకు మజ్లీస్ మిత్రపక్షం కనుక మంత్రి కేటీఆర్‌ దానిని వెనకేసుకొని వస్తూ బిజెపి మాత్రమే విభజన రాజకీయాలు చేస్తోందన్నట్లు మాట్లాడారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటులో తెరాస వ్యతిరేకించి, ఈ అంశంపై పోరాడుతున్న మజ్లీస్ పార్టీకి సంఘీభావం తెలిపి, రాష్ట్రంలో దాని అమలుపై ఆలోచిస్తామని కేటీఆర్‌ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 


Related Post