దేశం ఏమైపోతుందో?

December 28, 2019


img

ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై దేశంలో జరుగుతున్న ఆందోళనలు, వాటిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న భిన్న వాదనలు చూస్తుంటే సామాన్య ప్రజలలో గందరగోళం నెలకొంది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లతో దేశ ప్రజల మద్య చిచ్చుపెట్టి దేశసమగ్రతను దెబ్బ తీస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రతిపక్షాలు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తూ దేశసమగ్రతను దెబ్బ తీస్తున్నాయని బిజెపి ఆరోపిస్తోంది. ఎవరికివారు తమ వాదనలకు...తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప దీనివలన దేశానికి జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోవడం లేదు. ఈ అవాంఛనీయ పరిణామాలు దేశసమగ్రతకు భంగం కలిగించేవిధంగా ఉండటం చాలా ఆందోళన కలిగిస్తోంది.

అధికారంలో ఉన్నవారు ప్రజలకు మేలు చేయకపోయినా వారికి ఇబ్బందులకు గురిచేయకుండా ఉంటే చాలు. అలాగే ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో ఓ సాకుతో ఆందోళనలు చేస్తూ శాంతిసమరస్యాలకు, శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా ఉంటే చాలు. కానీ ఇప్పుడు దేశంలో అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ల పేరుతో ఒక రాజకీయ చదరంగం ఆడుతున్నాయి. వాటిలో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ప్రపంచదేశాలు కూడా భారత్‌ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాయి. ఆందోళనలు చేస్తున్నవారు, వాటిని వ్యతిరేకిస్తున్నవారు కూడా దేశసమగ్రతను, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామనే చెపుతుంటారు కానీ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుండటం చూస్తూనే ఉన్నాము. ఈ అవాంఛనీయ పరిణామాల వలన దేశగౌరవానికి భంగం కలుగుతోంది కూడా. 

కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించవలసిన మీడియా, మేధావులు కూడా వాటిలో మునిగి తేలుతుండటం వలన సమాజానికి మంచి చెడు వివరించి చెప్పేవారు లేకుండాపోయారు. ప్రజలు కూడా దీనికి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో మాట్లాడేవారినే  ఇష్టపడుతున్నారు తప్ప నిష్పక్షపాతంగా వాటిలో మంచిచెడులను వివరించేవారిని పట్టించుకోవడం లేదు. దాంతో అధికార ప్రతిపక్షాలు చూపుతున్న దారిలో ప్రజలు గుడ్డిగా పయనించవలసివస్తోంది. తత్ఫలితంగా ఒకప్పుడు కాశ్మీరుకే పరిమితమైన ఆందోళనలు, అల్లర్లు ఇప్పుడు దేశమంతటా వ్యాపించాయి. ఈ విపరీత పరిణామాలను చూస్తుంటే దేశం ఏమైపోతుందో అనే భయం కలుగుతోంది.


Related Post