కేటీఆర్‌ను సిఎం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయా?

December 27, 2019


img

రాష్ట్రంలో తెరాస అధికారంలో కొనసాగితే కేసీఆర్‌ తరువాత ఏనాటికైనా కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని అందరికీ తెలుసు. అయితే అది ఎప్పుడంటే..కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళినప్పుడని చెప్పవచ్చు. లోక్ సభ ఎన్నికల తరువాత కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నట్లు స్వయంగా చెప్పారు. కానీ వెళ్లలేకపోయారు. కారణాలు అందరికీ తెలుసు. ఒకవేళ వెళ్ళి ఉంటే అప్పుడే కేటీఆర్‌ను తెలంగాణ సిఎం చేసి ఉండేవారు.  

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు హటాత్తుగా కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడం గురించి మాట్లాడారంటే దానార్ధం సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడానికి సిద్దపడుతున్నారనుకోవచ్చు. అందుకు బలమైన కారణమే కనిపిస్తోంది. 

సీఏఏ, ఎనార్పీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన ఆందోళనలకు ప్రతిపక్షాలన్నీ మద్దతు పలుకుతున్నాయి. రాష్ట్రంలో మజ్లీస్ అధ్వర్యంలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. తమతో చేతులు కలపవలసిందిగా సిఎం కేసీఆర్‌ను కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మొన్న చెప్పారు. 

దేశంలో ప్రతిపక్షాలన్నీ మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నాయిప్పుడు. కనుక ఫెడరల్ ఫ్రంట్‌ వేదికగా వాటన్నిటినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి నాయకత్వం వహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తే ఆశ్చర్యం లేదు. తద్వారా జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించి తన సత్తా చాటుకోవాలనే కేసీఆర్‌ తపన, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టవచ్చు. అంటే స్వామికార్యం..స్వకార్యం రెండూ పూర్తవుతాయన్న మాట. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్‌ మనసులో ఆలోచనలను ఈవిధంగా బయటపెట్టి కొత్త చర్చకు తెర తీశారు కనుక నేటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు అందరూ దీనికి కోరస్ పాడటం మొదలుపెట్టి ప్రజలను మానసికంగా సిద్దం చేయవచ్చు. 

ఈ చర్చతో పార్టీలో ‘గులాబీ జెండా ఓనర్ల బ్యాచ్‌’కు బలమైన సందేశం కూడా పంపినట్లే భావించవచ్చు. కనుక వారి నుంచి ఏవైనా వ్యతిరేక రియాక్షన్స్ వచ్చినట్లయితే వారిని ‘సరిచేసిన తరువాత’ కేసీఆర్‌ మనసులో వచ్చిన ఈ ఆలోచనను అమలుచేసే ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. నేటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు కోరస్ పాడటం మొదలుపెట్టినా లేదా సీఏఏ, ఎనార్పీలకు వ్యతిరేకంగా సిఎం కేసీఆర్‌ గొంతు కలిపి పోరాటాలకు సిద్దపడినా ఈ ఊహాగానమంతా నిజమేనని భావించవచ్చు. 


Related Post