ఉత్తమ్‌కుమార్ రెడ్డి కీలక ప్రకటన

December 27, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిన్న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇకపై మా పార్టీ నేతలు ఏ సమస్యపై పోరాటంలోను తెరాస, బిజెపిలతో కలిసి పనిచేయకూడదని, వారితో వేదిక పంచుకోకూడదని నిర్ణయించాము. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయి. సీఏఏను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ సిఎం కేసీఆర్‌ దానిపై తన వైఖరిని చెప్పకుండా మౌనం పాటిస్తూ పరోక్షంగా బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ మొదటి నుంచి కూడా మోడీ ప్రభుత్వం తీసుకొంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్ధిస్తూనే ఉన్నారు. పెద్దనోట్ల రద్దుకు దేశంలో మొట్టమొదట మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆరే. 

తెలంగాణ ఏర్పాటుకు ఎంతగానో సహకరించిన మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్‌ను కాదని, ఆర్‌ఎస్ఎస్ నేపద్యం కలిగిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా ఎంపికయ్యేందుకు సిఎం కేసీఆర్‌ మద్దతు పలికారు. పార్లమెంటులో  సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ఇప్పుడు దానిపై మౌనం వహిస్తున్నారు. అందుకే రాష్ట్ర బిజెపి నేతలు కూడా మౌనం పాటిస్తున్నారు. ఈవిధంగా ప్రతీ విషయంలోనూ ద్వందవైఖరితో వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తున్న తెరాస, బిజెపిలతో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకొన్నాము,” అని అన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలు ప్రతిపక్షంలో ఉన్నందున కొన్ని సందర్భాలలో తెరాస సర్కార్‌పై పోరాటాలలో అవి కలిసి పనిచేశాయి. ఆర్టీసీ సమ్మెలో రెండు పార్టీలు కలిసి పనిచేయడం అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జాతీయస్థాయిలో బద్దవిరోధులుగా పరస్పరం కత్తులు దూసుకొంటున్న కాంగ్రెస్‌, బిజెపిలు రాష్ట్ర స్థాయిలో కలిసి పనిచేయడం అనివార్యమైనప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తెరాసతో కలిసి పనిచేయలేదు. బిజెపి కూడా తెరాసతో కలిసి పనిచేయనప్పటికీ ఆ రెండుపార్టీల మద్య రహస్య అవగాహన ఉందని ప్రజలు కూడా భావిస్తున్నారు.


Related Post