మజ్లీస్‌కు యస్... కాంగ్రెస్‌కు నో!

December 27, 2019


img

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తెరాస కూడా పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించింది. అందుకే సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నేడు మజ్లీస్ అధ్వర్యంలో నిజామాబాద్‌లో జరుగబోయే బహిరంగసభకు ప్రభుత్వం అనుమతించింది. కానీ అదే సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ శనివారం హైదరాబాద్‌ నగరంలో తలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తుండటం విశేషం. 

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రేపు ఉదయం గాంధీభవన్‌ నుంచి ట్యాంక్ బండ్ వరకు 'సేవ్ ఇండియా.. సేవ్ కానిస్టిట్యూషన్' పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. దానికి సెంట్రల్ జోన్ డీసీపీ అనుమతి నిరాకరించారు. దాంతో కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, జగ్గ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు శుక్రవారం డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి ర్యాలీకి అనుమతీయవలసిందిగా కోరారు. వారి అభ్యర్ధనపై డిజిపి మహేందర్ రెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

రాష్ట్రంలో తెరాస అధికారంలో ఉన్నందున అది స్వయంగా ధర్నాలు, ర్యాలీలలో పాల్గొనలేదు కనుక తమ పార్టీ వైఖరికి అనుగుణంగా ముందుకు సాగుతున్న మజ్లీస్ పార్టీకి నిజామాబాద్‌లో బహిరంగసభకు అనుమతించిందనుకోవచ్చు. మజ్లీస్ పార్టీని అనుమతించినప్పుడు అదే అంశంపై పోరాడుతున్న తమను ఎందుకు అనుమతించడం లేదు? అని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

కనుక సీఏఏ, ఎన్నార్సీల విషయంలో తెరాస ద్వంద వైఖరి అవలంభిస్తోందా లేక వాటి కోసం కాంగ్రెస్ పార్టీని పోరాడేందుకు అనుమతీస్తే అది నగరంలోని ముస్లింలను మళ్ళీ తన వైపు ఆకర్షించుకొని రాజకీయ మైలేజీ పొందుతుందని తెరాస భయపడుతోందా? అనే సందేహం కలుగుతోంది. ఇవి పైకి చెప్పుకోలేని విషయాలు కనుక నగరంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతాయనే కారణంతో కాంగ్రెస్‌ ర్యాలీకి అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పుకోవచ్చు.


Related Post