తెలంగాణలో బిజెపి మళ్ళీ ఆ మ్యాజిక్ చేయగలదా?

December 26, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో బిజెపీకి తెలంగాణలో డిపాజిట్లే దక్కవనుకొంటే ఏకంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకొంది. ఆ అనూహ్య విజయంతో రాష్ట్ర బిజెపి నేతలలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. తెలంగాణలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని, వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని వాదించడం మొదలుపెట్టారు. 

సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలు ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని తప్పులుంటే సరిచేసుకొనే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ లోక్ సభ ఎన్నికలలో 4 సీట్లు ఏవిధంగా గెలుచుకోగలిగామని బిజెపి విశ్లేషించుకొని ఉంటే తదుపరి ఎన్నికలలో లాభపడి ఉండేదేమో? కానీ విజయోత్సాహంతో ఉన్నప్పుడు ‘మనం ఎలా గెలిచాము.. ఎందుకు గెలిచాము,” వంటి ఆలోచనలు చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి కనుక ఆలోచించలేదు.

ఆ తరువాత ఎన్నికలలో బోర్లా పడింది. పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ల ఆందోళనల పుణ్యమో లేక జార్ఖండ్ బిజెపి నేతల అసమర్ధతో తెలీదు కానీ జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయింది. ఈ పరిస్థితులలో బిజెపి మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవలసివస్తోంది.

కనుక లోక్ సభ ఎన్నికలలో చేసిన ఆ మ్యాజిక్ మళ్ళీ ఇప్పుడు చేయగలదా? అంటే డౌటే. వామపక్షాలు ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉంటాయి కానీ ప్రతీ ఎన్నికలలో ఓడిపోతుంటాయి. రాష్ట్రంలో బిజెపి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. 

అందుకు మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1. పార్టీలో బలమైన నేతలు లేకపోవడం. 2. పార్టీ సిద్దాంతాలను ప్రజలలోకి బలంగా వ్యాపింపజేయలేకపోవడం. 3. హిందూ ఓటు బ్యాంకునే నమ్ముకోవడం. 

1. కాంగ్రెస్‌, తెరాసలను చూసినట్లయితే కనీసం డజనుకు పైగా ప్రజలకు బాగా సుపరిచితులైన, బలమైన నేతలు కనిపిస్తారు కానీ బిజెపిలో అటువంటివారిని వేళ్ళపై లెక్కించవచ్చు. అందుకే ఎన్నికలొచ్చిన ప్రతీసారి అభ్యర్ధులను ఎక్కడి నుంచో దిగుమతిచేసుకోవలసి వస్తోంది. 

2. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, ప్రజాస్వామ్యవిలువలకు కట్టుబడిన పార్టీ అనే అభిప్రాయం చాలా మందికుంది. తెరాస తెలంగాణవాదానికి బలంగా కట్టుబడి ఉందనే నిశ్చితాభిప్రాయం ప్రజలకుంది. అలాగే మజ్లీస్ యావత్ ముస్లింలకు ప్రతినిధిగా గుర్తింపు సాధించుకోగలిగింది. బిజెపి హిందుత్వవాదానికి కట్టుబడి ఉంటుందని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌, తెరాస, మజ్లీస్ పార్టీలు తమ తమ పార్టీల విధానాలతో ఆయా వర్గాల ప్రజలతో మమేకం కాగలిగాయి కనుక వారిని ఆకట్టుకోగలుగుతున్నాయి. కానీ బిజెపి నేతలు మాత్రం తమ హిందుత్వ సిద్దాంతంతో ప్రజలను మెప్పించలేకపోతున్నారు లేదా తమ సిద్దాంతాన్ని ప్రజలలోకి బలంగా వ్యాపింపజేయలేకపోతున్నారు. అందుకే రాష్ట్ర బిజెపి నేతలు ఎన్నికలొచ్చిన్న ప్రతీసారి నరేంద్రమోడీ, అమిత్ షాల జపం చేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

3. ఇక కాంగ్రెస్‌, తెరాసలు కులాలవారీగా, మజ్లీస్ యావత్ ముస్లింలతో ఓటు బ్యాంకులు ఏర్పరచుకొంటుంటే, బిజెపి మాత్రం హిందూ ఓటు బ్యాంక్‌పై ఆశలు పెట్టుకొంటుంది. కానీ హిందువులు కులాల వారీగా, కాంగ్రెస్‌, తెరాసల మద్య చీలిపోయున్నప్పుడు వారిని ‘హిందూ కార్డు’తో ఆకట్టుకోవడం అసాధ్యం అని రాష్ట్ర బిజెపి నేతలు గ్రహించినట్లు లేదు. 

కనుక తెలంగాణ బిజెపి ముందుగా ఈ లోపాలన్నిటినీ సరిదిద్దుకోవలసిన అవసరం చాలా ఉంది. 


Related Post