ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ మళ్ళీ సిద్దం?

December 26, 2019


img

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎన్నార్సీ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్పీఆర్)లను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న ముస్లిం సంఘాల ప్రతినిధులు బుదవారం ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిశారు. వాటి గురించి తమ అభిప్రాయాలను సిఎం కేసీఆర్‌కు తెలియజేసి ఈ పోరాటంలో తమతో చేతులు కలపవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈ మూడిటినీ వ్యతిరేకిస్తూ రేపు (శుక్రవారం) నిజామాబాద్‌లో బారీ బహిరంగసభ నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ తమకు సూచించారని, ఆ సభకు ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉందని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. 

ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్లుగా సిఎం కేసీఆర్‌ నిజామాబాద్‌ సభకు హాజరైనట్లయితే, ఆ తరువాత మోడీ ప్రభుత్వంపై యుద్ధభేరీ మ్రోగించేందుకు సికింద్రాబాద్‌ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వయంగా ఓ భారీ బహిరంగసభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దానితో మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్‌కు ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చునని తెలుస్తోంది.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిఎం కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి, ఎన్నికల తరువాత జాతీయరాజకీయాలలో ప్రవేశించాలనుకొన్నారు. కానీ ఆయన అంచనాలకు భిన్నంగా కేంద్రంలో మళ్ళీ బిజెపి బారీ మెజార్టీతో అధికారంలోకి రావడం, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు ఎదురుదెబ్బ తగలడంతో సిఎం కేసీఆర్‌ తన ఫెడరల్ ఫ్రంట్‌ ప్రతిపాదనను అటకెక్కించేశారు. 

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న సిఎం కేసీఆర్‌ వద్దకు ముస్లిం ప్రతినిధులు ఉద్యమ ప్రతిపాదనతో రావడంతో ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం సీఏఏ, ఏనార్సీ, ఏనార్పీలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వివిద వర్గాల ప్రజలు ఉదృతంగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా వారితో కలిసి ఆందోళనలలో పాల్గొంటున్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు వాటిని తమ రాష్ట్రాలలో అమలుచేయబోమని నిర్ద్వందంగా ప్రకటించారు. 

కనుక ఒకవేళ  సిఎం కేసీఆర్‌ సికింద్రాబాద్‌లో బహిరంగసభ నిర్వహించడానికి సిద్దపడితే అది మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు వేస్తున్న తొలి అడుగుగా భావించవచ్చు. అందుకు సిఎం కేసీఆర్‌ సిద్దపడితే దేశంలో బిజెపియేతర పార్టీల నేతలను, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులను ఆ సభకు ఆహ్వానించవచ్చు. సిఎం కేసీఆర్‌ ఇప్పుడు జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడానికి సానుకూల వాతావరణం కనిపిస్తోంది కనుక ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు మరో ప్రయత్నం చేస్తారేమో చూడాలి. 


Related Post