మున్సిపల్ ఎన్నికలు: కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటో?

December 25, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండవసారి పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలలో 12 మంది తెరాసలో చేరిపోవడంతో శాసనసభలో ప్రధానప్రతిపక్ష హోదా కోల్పోవడమే కాకుండా రాష్ట్రంలో రాజకీయంగా చాలా బలహీనపడింది కూడా. కానీ వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 3 సీట్లు గెలుచుకొని మళ్ళీ తన బలం నిరూపించుకొంది. ఇప్పుడు మళ్ళీ మరోసారి తన బలం నిరూపించుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల రూపంలో మరో అవకాశం వచ్చింది. అయితే ఈ ఎన్నికలలో తెరాసను డ్డీకొని ఓడించగలదా..లేదా?తెలియాలంటే దాని బలాబలాల గురించి తెలుసుకోవాలి. 

కాంగ్రెస్ పార్టీకి ముఖ్యబలం ఆ పార్టీ నేతల అపార రాజకీయ అనుభవం, నేటికీ చెక్కు చెదరని పార్టీ క్యాడర్, ఓటు బ్యాంక్ అని చెప్పవచ్చు. అన్నిటికీ మించి ఆ పార్టీ నేతల సొంత బలంతో నెగ్గగల శక్తివంతులు. అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యూహాలు దారుణంగా విఫలమైనప్పటికీ 19 మంది అభ్యర్ధులు వారి సొంతబలంతోనే గెలవడమే అందుకు ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికలలో కూడా అదేవిధంగా గెలిచింది. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశమేనని భావించవచ్చు. ఆర్టీసీ సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులకు చివరివరకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడివారి మనసులలో స్థానాలు సంపాదించుకొంది. కనుక ఆర్టీసీ కార్మికుల ఓట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఇక పౌరసత్వ సవరణ చట్టాన్ని తెరాస వ్యతిరేకించినప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడవలసి ఉన్నందున ఆందోళనలను అడ్డుకోవలసివస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నందున దానికి ఇటువంటి పరిమితులు, ఇబ్బందులు ఏమీ ఉండవు కనుక నిర్భయంగా ముస్లింల ఆందోళనలకు మద్దతు ఇస్తోంది. కనుక వారి ఓట్లు కూడా కాంగ్రెస్‌ పార్టీకి పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగినందున అసహనంతో ఉన్న ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినా ఆశ్చర్యం లేదు. 

ఇక ప్రతికూలాంశాల జాబితా కాస్త పెద్దదిగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని పట్టించుకోకుండా పిసిసి అధ్యక్ష పదవి కోసం ముఖ్యనేతలు కీచులాడుకోవడం. పార్టీ సీనియర్ నేతల మద్య అనైక్యత, ప్రతిపక్షాల మద్య అనైక్యత, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన సీనియర్లలో జానారెడ్డి వంటి కొందరు ఇంకా యాక్టివ్ కాలేకపోవడం. నేతలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులతో జిల్లా, గ్రామ స్థాయిలో పార్టీ బలహీనపడటం, అదే కారణంగా అక్కడ తెరాస బలపడటం, కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలిచినవారు తెరాసలోకి వెళ్ళిపోతారని ప్రజలలో బలమైన అభిప్రాయం ఏర్పడటం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనందున రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించుకురాలేదు..కనుక అభివృద్ధి చేయలేదనే ప్రజలలో అనుమానాలు వంటి అనేక ప్రతికూలాంశాలు కనబడుతున్నాయి. 

కనుక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోవచ్చు కానీ కాంగ్రెస్‌ నేతల సొంత బలం, క్యాడర్, సాంప్రదాయ ఓటు బ్యాంక్ వలన గౌరవప్రదమైన స్థానాలే దక్కించుకోగలదని భావించవచ్చు.


Related Post