సిఎం కేసీఆర్‌కు నేడు సీఏఏ పరీక్ష

December 25, 2019


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌కు నేడు ఓ అగ్నిపరీక్ష ఎదుర్కొబోతున్నారు. పౌరసవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ)లను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పోరాడుతున్న యునైటెడ్ ముస్లిం కమిటీ నేతృత్వంలో ఒక బృందం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలువనుంది. మజ్లీస్ పార్టీ అధినేత, సిఎం కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా వారితో వెళ్ళి సిఎం కేసీఆర్‌తో ఈ రెండు అంశాలపై మాట్లాడనున్నారు. కేరళ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రుల వలె కేసీఆర్‌ కూడా ఆ రెంటినీ వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటన ఇవ్వాలని వారు కోరనున్నట్లు సమాచారం. 

పార్లమెంటులో పౌరసవరణ చట్టానికి తెరాస వ్యతిరేకించింది కనుక రాష్ట్రంలో ముస్లింల పోరాటాలకు తెరాస మద్దతు తెలుపాలని వారు కోరుకోవడం సహజమే. అయితే వాటిని వ్యతిరేకిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించినట్లయితే అది మెజార్టీ హిందువులకు ఆగ్రహం కలిగిస్తుంది. బిజెపికి వరంగా మారుతుంది. పైగా మున్సిపల్ ఎన్నికలు కూడా దగ్గరపడ్డాయి. 

కనుక పార్లమెంటులో ఆ బిల్లును మొక్కుబడిగా వ్యతిరేకించి ఇప్పుడు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిద్దామనుకొంటే మజ్లీస్ నేతలకు, ముస్లింలకు కోపం వస్తుంది. రాష్ట్రంలో తెరాస రాజకీయంగా చాలా బలంగా ఉన్నప్పటికీ మజ్లీస్ పార్టీని, ముస్లింలను  దూరం చేసుకొనే సాహసం చేయ(లే)దు. అలాగని వారి కోసం సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ సిఎం కేసీఆర్‌ ప్రకటన చేయలేరు. కనుక కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు లౌక్యంగా ఈ సమస్య నుంచి బయటపడాల్సి ఉంటుంది. అటువంటి లౌక్యం సిఎం కేసీఆర్‌కు పుష్కలంగా ఉందనే సంగతి అందరికీ తెలుసు. కనుక సున్నితమైన ఈ రెండు అంశాలపై ఆయన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.         



Related Post