ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ నేతల అభ్యంతరాలు

December 25, 2019


img

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వార్డుల రిజర్వేషన్ల వివరాలను వెంటనే ప్రకటించాలని లేకుంటే ఎన్నికల షెడ్యూల్‌ను మార్చాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం సమన్వయకమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు కోదండరెడ్డి, నిరంజన్, శ్యామ్మోహన్, తదితరులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డిని కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. జనవరి 8 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కనుక జనవరి 6న వార్డుల రిజర్వేషన్లను ప్రకటిస్తే రెండు రోజులలోగా అభ్యర్ధులను ఎంపిక చేసుకొని, నామినేషన్‌కు అవసరమైన దృవపత్రాలను సేకరించుకోవడం చాలా కష్టమవుతుందని వారు నాగిరెడ్డికి తెలియజేశారు. పైగా సంక్రాంతి పండుగ సమయంలో నామినేషన్ల స్వీకరణ (జనవరి 8 నుంచి 11 వరకు), నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీలు (జనవరి 12,13), నామినేషన్ల ఉపసంహరణ (జనవరి 14వరకు) ప్రక్రియలను నిర్వహించడాన్ని కూడా వారు తప్పు పట్టారు. అయితే వారి అభ్యంతరాలు, సూచనలపై కమీషనర్ నాగిరెడ్డి వారికి ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ, “స్వతంత్రంగా వ్యవహరించ వలసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తెరాస సర్కార్‌ తాబేదారులాగ వ్యవహరిస్తోంది. అధికార పార్టీ వద్ద ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్ల వివరాలు ఉంటాయి కనుక వాటిని ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం చూస్తే ప్రతిపక్షాలను దెబ్బ తీసి తెరాసకు లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఓటర్ల జాబితాలలు, వార్డుల విభజనలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసింది. అయినా ఎన్నికల సంఘం తీరు మారలేదు. కనుక మళ్ళీ మరోసారి హైకోర్టులో మొట్టికాయలు తినకతప్పదేమో?” అని అన్నారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించక మునుపే సోషల్ మీడియాలో తెరాస కార్యకర్తలు ఆ వివరాలు ఎలా పెట్టగలిగారు? ముందుగా ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్లు ప్రకటించాలని హైకోర్టు సూచించినా కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని ఏమనుకోవాలి?ఎన్నికల సంఘం తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం చేస్తున్న అధికారులందరిపై కటిన చర్యలు తీసుకొంటుంది,” అని హెచ్చరించారు. 


Related Post