ఎన్నికల సంఘంపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనుమానాలు

December 24, 2019


img

రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన తీర్పు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలను, వార్డుల రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు చూస్తే అది ఆ వివరాలను తెరాసకు ముందే రహస్యంగా అందజేసినట్లు అనుమానం కలుగుతోందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వార్డుల రిజర్వేషన్లను ప్రకటించకుండా జాప్యం చేయడం ద్వారా ప్రతిపక్షపార్టీలకు అభ్యర్ధులను ఖరారు చేసుకోలేని పరిస్థితులు కల్పించాలని కుట్ర జరుగుతున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కనుక ముందుగా వార్డుల రిజర్వేషన్లను ప్రకటించింది ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్‌ను మళ్ళీ సవరించి ప్రకటించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ ఎన్నికల సంఘం స్పందించకుంటే దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. 

ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభ్యంతరాలపై తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పందిస్తూ, “ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎప్పుడూ ఎన్నికలంటే భయమే. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోర్టుకు వెళతానని అంటున్నారు. ఆయనకు ఎన్నికల విషయంలో ప్రజలపై కంటే కోర్టులపైనే ఎక్కువగా ఆశ పెట్టుకొంటుంటారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి   ఎన్నికల షెడ్యూల్ చూసి భయపడటం చూస్తుంటే ఎన్నికలకు ముందే తెరాస గెలుపు ఖాయం అయినట్లే. మున్సిపల్ ఎన్నికలలో తెరాస తిరుగులేని విజయం సాధించడం తధ్యం,” అని అన్నారు. 

అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేటప్పుడే ఓటర్ల జాబితాలను, వార్డుల రిజర్వేషన్లు కూడా ఎన్నికల సంఘం ఎందుకు ప్రకటించలేదు?అనే ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నకు కర్నె ప్రభాకర్ సమాధానం చెప్పలేదు. అంటే ఆ వివరాలు ముందుగా ప్రకటించకపోయినా తెరాసకు ఇబ్బంది లేదనుకోవాలా?


Related Post