మున్సిపల్ ఎన్నికలు...తెరాస ప్లస్, మైనస్‌లు

December 24, 2019


img

జనవరి 22న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. అంటే నెలరోజులు కూడా సమయం లేదన్నమాట! కనుక రాష్ట్రంలో మూడు ప్రధానపార్టీల బలాబలాలను ఏవిధంగా ఉన్నాయో ఓసారి చూడక తప్పదు. 

ముందుగా అధికార తెరాస గురించే చెప్పుకోవాలి. లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తిన్నప్పటికీ ఆ తరువాత జరిగిన పంచాయతీ, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో తన సత్తా చాటుకొంది. 

రాష్ట్రంలో అధికారంలో ఉండటం...అదీ...తిరుగులేని అధికారం కావడం, ఆ కారణంగా రాష్ట్రంలో యావత్ అధికార యంత్రాంగం తెరాస నేతల చెప్పుచేతలలో ఉండటం, ఎన్నికల వ్యూహాలు రచించి వాటిని అంతే పకడ్బందీగా అమలుచేసి సత్ఫలితాలు రాబట్టడంలో సిఎం కేసీఆర్‌కున్న నేర్పు, ఆ వ్యూహాలను అంతే ఖచ్చితంగా అమేలుచేయగల సమర్ధులైన మంత్రులు, నేతలు కలిగి ఉండటం, రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపి నేతలకు భిన్నంగా తెరాస నేతలందరూ అచ్చమైన తెలంగాణ యాసతోనే మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకొనే నేర్పు కలిగి ఉండటం, గత ఐదున్నరేళ్ళలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాలు, గ్రామస్థాయి వరకు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు వంటి అనేకానేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. 

ప్రతికూలాంశాల విషయానికి వస్తే ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె ప్రభావం తెరాసపై ఎంతో కొంత తప్పక ఉండవచ్చు. ఆర్టీసీ కార్మికులు సిఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేసి తిరిగి విధులలో చేరినప్పటికీ, 55 రోజుల సమ్మెలో వారు పడిన కష్టాలు, తిన్న ఎదురుదెబ్బలు, ఆ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి సిఎం కేసీఆర్‌ చులకనగా మాట్లాడిన మాటలు, సమ్మె సమయంలో 30 మందికి పైగా కార్మికులు చనిపోవడం, ఆర్టీసీలో నేటికీ ఉద్యోగ భద్రతలేకపోవడం, అధికారుల  వేధింపులు వంటి అనేక కారణాల వలన నేటికీ ఆర్టీసీ కార్మికులు లోలోన ఆగ్రహం, ఆందోళనతోనే ఉన్నారు. కనుక ఆర్టీసీ కార్మికులు, వారి బందుమిత్రులలో అధికశాతం మున్సిపల్ ఎన్నికలలో తెరాసకు వ్యతిరేకంగా ఓట్లు వేయవచ్చు.

ఆర్టీసీ సమ్మె ప్రభావం సింగరేణి కార్మికులకు కూడా ఆవేదన కలిగించే ఉంటుంది. ఆలోచింపజేసే ఉంటుంది. కనుక వారిలోను కొంతమందికి తెరాస పట్ల వ్యతిరేకత పెరిగితే ఆశ్చర్యం లేదు. ఇక రాష్ట్రంలో పెరిగిన హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపుల పట్ల ప్రజలలో అసహనం పేర్కొని ఉంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో అది కొంచెం  చల్లబడినప్పటికీ ప్రజలు ఇంకా అసహనంగానే ఉన్నారు. అలాగే పౌరసత్వ చట్ట సవరణపై రాష్ట్రంలో మొదలైన  ఆందోళనలు తెరాసతో సహా అన్ని పార్టీలపై ఎంతో కొంత అనుకూల, ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అయితే మొత్తంగా చూసినట్లయితే మున్సిపల్ ఎన్నికలలో తెరాస సులువుగానే గట్టెక్కవచ్చు.


Related Post