అచ్చంపేట కేసులో కొత్త ట్విస్ట్

December 24, 2019


img

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో ఈనెల 18న ఒక గర్భిణికి ఆసుపత్రి వైద్యులు ప్రసవం చేస్తునప్పుడు, పొరపాటున ఆ శిశువు తల మొండెం నుంచి వేరైపోవడంతో శిశువు మరణించింది. బాధితురాలికి ప్రసవం చేసిన డాక్టర్ సుధారాణి, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ తారాసింగ్‌లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసి దీనిపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని వేసింది. ఆ కమిటీ విచారణ జరుపుతుండగా ఈ కేసులో కొత్త మలుపు తిరిగింది.  

ఈ ఘటనతో సస్పెండ్ అయిన డాక్టర్ సుధారాణి తన తల్లితండ్రులతో కలిసి సోమవారం ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె త్రిసభ్య కమిటీ సభ్యులను కలిసి కొన్ని కొత్త విషయాలు చెప్పారు. తాను జూనియర్ డాక్టర్ అయినందున తనకు అవుట్ పేషంట్‌ వార్డులో డ్యూటీ వేస్తే చేస్తున్నానని, ఆరోజు తాను అసలు ఆపరేషన్ ధియేటర్లోకే వెళ్లలేదని తెలిపారు. సీనియర్ డాక్టర్ సిరాజ్ ఆరోజు బాధితురాలికి ప్రసవం చేశారని చెప్పారు. అందుకు సాక్ష్యంగా ఆయన సంతకం చేసిన రిఫెరల్ షీట్‌ను ఆమె చూపించారు. ఆరోజు ఆ ఘటన జరిగిన తరువాత దాని గురించి తనకు తెలియజేయకుండా మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రికి పంపించాలని సిఫార్సు చేస్తూ ఆయన సంతకం చేసి రిఫెరల్ షీట్‌ ఇచ్చారని తెలిపారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ తారాసింగ్‌ బాధితురాలి కుటుంబసభ్యులకు నచ్చజెప్పి పంపించేయాలని చెప్పడంతో తాను వారికి బాధితురాలిని అప్పగించి పంపించేశానని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని డాక్టర్ సుధారాణి తెలిపారు. డాక్టర్ సిరాజ్‌ను కాపాడేందుకే తనను ఈ కేసులో ఇరికించి బలిపశువు చేశారని డాక్టర్ సుధారాణి ఆరోపించారు. ఈ ఆరోపణలలో నిజానిజాలను కనుగొని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని త్రిసభ్య కమిటీ ఆమెకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ప్రసవ సమయంలో ఊడిపడిన శిశువు తల...తల్లి గర్భంలో మృతి చెంది ఉన్న శిశువుదేనా కాదా? అనే విషయం దృవీకరించుకొనేందుకు శిశువు తలను, మొండేన్ని ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. త్వరలోనే ఆ నివేదిక రానుంది. డాక్టర్ సుధారాణి చెప్పిన ఈ కొత్తవిషయాలు, చూపుతున్న సాక్ష్యాధారాలను బట్టి చూస్తే ఆమెకు ఈ కేసుతో సంబందం లేనట్లే కనిపిస్తోంది. ఆమెకు దీనితో సంబందం ఉందా లేదా అనే విషయం త్రిసభ్య కమిటీ తేల్చవలసి ఉంటుంది. 


Related Post