మూడు ముక్కలాటలో పసుపు రైతులు పావులు

December 24, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో తనను ఎన్నుకొంటే నెలరోజులలోగా నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటుచేయిస్తానని హామీ ఇచ్చి బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ గెలిచారు. కానీ 7 నెలలవుతున్నా హామీ నెరవేర్చలేదు పైగా..బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని చెప్పుతున్నారిప్పుడు. 

ఈ ప్రకటన సహజంగానే పసుపు రైతులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. దాంతో వారు ఎంపీ ధర్మపురి అరవింద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో పాదయాత్రలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆయన దిష్టిబొమ్మలను తగులబెట్టి నిరసనలు తెలియజేస్తున్నారు. 

ఇది కాంగ్రెస్‌, తెరాసలకు వరంగా మారింది. ముఖ్యంగా జిల్లాలో తనకు తిరుగేలేదనుకొన్న సిఎం కేసీఆర్‌ కుమార్తె కవిత లోక్‌సభ ఎన్నికలలో ధర్మపురి అరవింద్‌ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో జిల్లా తెరాస నేతలు బిజెపిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మ్రోగడంతో వారికిప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఈ అంశాన్ని ఆయుధంగా మలుచుకొని బిజెపిని చావుదెబ్బ తీసేందుకు సిద్దం అవుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అస్త్రంతో తెరాస, బిజెపిలను ఎదుర్కొని మున్సిపల్ ఎన్నికలలో గెలవాలని ఆశపడుతోంది. దాంతో కాంగ్రెస్‌, బిజెపిలు పసుపు రైతుల పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ ఆ అగ్నికి ఆజ్యం పోసి రాజేసే ప్రయత్నం చేస్తున్నాయి.  

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున నిజామాబాద్‌ జిల్లాలో తరువాత తెరాస పాగా వేయగా లోక్‌సభ ఎన్నికలలో ఘన విజయం సాధించి బిజెపి పాగా వేయగలిగింది. దాంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో గెలిచి జిల్లాపై మళ్ళీ ఆధిపత్యం సాధించలాని కాంగ్రెస్‌ నేతలు ఆశపడుతున్నారు.   

ఇదంతా చూస్తే కాంగ్రెస్‌, తెరాస, బీజేపీలు మూడూ కూడా పసుపు రైతుల సమస్యలను పరిష్కరించలేవు కానీ అవి ఆడుకొనే ఈ మూడు ముక్కలాటలో పసుపు రైతులను పావులుగా వాడుకొని లబ్ది పొందగలుగుతున్నాయని స్పష్టం అవుతోంది.


Related Post