బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇంకా ఎప్పుడో?

December 23, 2019


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కడప జిల్లాలో సున్నపురాళ్ళపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. మూడేళ్ళలో దీని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఏడాదికి 30 లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ముడి ఇనుము సరఫరా కోసం ఎన్ఎండిసీతో ఒప్పందం చేసుకొన్నామని తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాది అవకాశాలు లభిస్తాయని సిఎం జగన్ చెప్పారు. దీంతో జిల్లావాసుల జీవితాలలో గణనీయమైన మార్పు వస్తుందని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

రాష్ట్ర విభజన సందర్భంగా కడప, బయ్యారంలో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తరువాత నిపుణుల కమిటీ అధ్యయనం పేరుతో 3-4 ఏళ్ళు దొర్లిపోయిన తరువాత ఆ రెండు ప్రాంతాలలో లభిస్తున్న ముడి ఇనుము నాణ్యత 45-50 శాతం ఉందని, దానితో ఉక్కు ఉత్పత్తి లాభదాయకం కాదని చెప్పి చేతులు దులుపుకొంది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్వయంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి సిద్దపడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ నిపుణుల కమిటీ వేసింది. ఆ తరువాత ఏమయిందో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సైలెంట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సిద్దం అవుతోంది. 

విశాఖలో స్టీల్ ప్లాంట్‌ పరిసర ప్రాంతాలలో ఎక్కడా ముడి ఇనుము గనులు లేవు. కనీసం సమీపంలో బొగ్గు గనులు కూడా లేదు. ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి ముడి ఇనుము, బొగ్గును తెచ్చుకొని దశాబ్ధాలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విజయవంతంగా నడుస్తోంది. దానిలో వేలాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగఉపాది అవకాశాలు పొందారు. ఒకప్పుడు నగర శివారు ప్రాంతంగా ఉన్న గాజువాక ఆ స్టీల్ ప్లాంట్ కారణంగా 4-5 ఏళ్ళలోనే చాలా అభివృద్ధి చెందింది. 

సమీపంలో ఎటువంటి వనరులు లేని వైజాగ్ స్టీల్ ప్లాంట్ దశాబ్ధాలుగా విజయవంతంగా నడుస్తున్నప్పుడు, మరి పక్కనే  సింగరేణిలో కావలసినంత బొగ్గు, పొరుగు రాష్ట్రాల నుంచి ముడి ఇనుము తెచ్చుకొనే వెసులుబాటు ఉన్నప్పుడు బయ్యారంలోనో లేదా రాష్ట్రంలో అంతకంటే మరో అనువైన ప్రదేశంలోనో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఎందుకు నిర్మించలేకపోతోంది?


Related Post