తెలంగాణలో ఆర్ఎస్ఎస్ విస్తరణకు శ్రీకారం

December 23, 2019


img

బిజెపికి ఆర్ఎస్ఎస్ వెన్నెముక వంటిదని అందరికీ తెలుసు. ఇది మహారాష్ట్రతో సహా ఉత్తరాది రాష్ట్రాలలో చాలా బలంగా ఉంది.  ఆర్ఎస్ఎస్ దక్షిణాదిన రాష్ట్రాలలో కూడా విస్తరించి ఉన్నప్పటికీ ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాలలో అంత చురుకుగా కనిపించదు. అయితే ఆర్ఎస్ఎస్ విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టాలని ఆ సంస్థ పెద్దలు నిర్ణయించారు. దీనిలో భాగంగా మంగళవారం నుంచి మూడు రోజులు హైదరాబాద్‌లో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించడానికి చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగర శివార్లలోని భారత్‌ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో విజయ సంకల్ప శిబిరం పేరుతో జరుగబోయే ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారు 7,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరుకాబోతున్నారు. 

మొదటిరోజు సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ విస్తరణకు ఉన్న అవకాశాలను, అవరోధాల గురించి లోతుగా చర్చించనున్నట్లు సమాచారం. హిందువులందరినీ ఒకేతాటిపైకి తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. అయితే హిందువులందరూ కులాలు, బాషలు, ప్రాంతాలు, పార్టీల వారీగా విడిపోయినందున వారి మద్య ఐఖ్యతను పెంపొందించేవిధంగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. ఇంకా కులగజ్జి అంటుకోని యువతారాన్ని చైతన్యపరచడం ద్వారా వారిని ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. యువతకు చేరువయ్యేందుకు ఆర్ఎస్ఎస్ కూడా సోషల్ మీడియాను వినియోగించుకోవాలని భావిస్తోంది. ముందుగా తెలంగాణ 5 లక్షల మందిని ఆర్ఎస్ఎస్‌లో చేర్చుకోవాలనే లక్ష్యం నిర్దేశించుకొంది. వారిలో 50 శాతం కాలేజీ విద్యార్దులు, యువత ఉండాలని భావిస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్‌ బలపడితే బిజెపి కూడా బలపడుతుంది కనుక దాని ఈ ప్రయత్నాలకు బిజెపి సంపూర్ణ మద్దతు ఇవ్వడం తధ్యం. ఆర్ఎస్ఎస్‌ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.


Related Post