చిరంజీవి మళ్ళీ దూకేస్తారా?

December 23, 2019


img

ప్రజారాజ్యం పార్టీతో ఏపీకి ముఖ్యమంత్రి అయిపోదామని చిరంజీవి ఆశపడి భంగపడ్డారు. అప్పుడు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి కేంద్రమంత్రి పదవి సంపాదించుకున్నారు. కానీ ఆ తరువాత దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు తుడిచిపెట్టుకుపోవడంతో కష్టకాలంలో కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలబడకుండా దానిని పక్కన పడేసి మళ్ళీ హాయిగా సినిమాలు చేసుకొంటున్నారు. ఇటువంటి సమయంలో చిరంజీవి మళ్ళీ రాజకీయ ప్రకటన చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో మళ్ళీ మర్నాడు ‘దానికి తాను కట్టుబడి ఉన్నానంటూ’ చిరంజీవి మరో ప్రకటన చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దాంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి హటాత్తుగా ఈవిధంగా ఎందుకు స్పందించారు? అనే చర్చ మొదలైంది. 

దీనిపై టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ, “తెలంగాణలో సినిమాలు, వ్యాపారాలు చేసుకొనే చిరంజీవికి ఏపీ ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి? తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తుంటే అన్న సమర్ధించడాన్ని ఏమనుకోవాలి? చిరంజీవి మళ్ళీ గోడ దూకేయాలనుకొంటున్నారేమో? అందుకే హటాత్తుగా ఈ ప్రకటన చేశారేమో?” అని అన్నారు. 

అయితే తాను రాజకీయాలలో ఇమడలేనని చిరంజీవి ఇప్పటికే బాగా గుర్తించారని చెప్పవచ్చు. పైగా చిరంజీవి ఇప్పుడు గోడ దూకే పరిస్థితిలో కూడా లేరు. మరి జగన్ ప్రతిపాదనను సమర్ధిస్తూ ఎందుకు మాట్లాడారు? అంటే..ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో మంచిగా ఉండటం ద్వారా ఏపీలో తన సినిమాలకు, ఆస్తులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ముందుజాగ్రత్త పడుతున్నారనుకోవచ్చు. ఇంతకుమించి బలమైన కారణం కనిపించడం లేదు.


Related Post