దానికి కట్టుబడి ఉండటం ఎంత కష్టమో!

December 21, 2019


img

ప్రస్తుతం రాజకీయాలు కులమతాలను శాశిస్తున్నాయో లేక కులమతాలే రాజకీయాలను శాశిస్తున్నాయో తెలియని గందరగోళ పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ‘ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా నిఖార్సుగా...నిజాయితీగా... లౌకికవాదానికి కట్టుబడి ఉండటం ఎంతో కష్టం. ఒకవేళ ఉందామనుకొన్న పరిస్థితులు ఉండనీయవు. 

ఉదాహరణకు ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాలలో పౌరసవరణ చట్టానికి వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని వలన మతాల మద్య చిచ్చు రగులుతుందని మేధావులు, పార్టీల నేతలు, ఆందోళనకారులు వాదిస్తున్నారు. అయితే పార్లమెంటులో దానిని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్, తెరాస వంటి పార్టీలు అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ ఆందోళనలకు మద్దతు ఈయలేని స్థితి నెలకొంది. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనో లేదా మెజార్టీ వర్గం ప్రజలను దూరమవుతారనే భయంతోనో అవి ఆందోళనలను సమర్ధించలేకపోతున్నాయి. అలాగే పార్లమెంటులో ఈ చట్టానికి అనుకూలంగా ఓట్లు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఇదే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. తమ వైఖరికి భిన్నంగా సాగుతున్న ఆందోళనలను అడ్డుకొనేందుకు భయపడుతున్నాయి. అంటే తమ వైఖరికి భిన్నంగా వ్యవహరించవలసి వస్తోందన్నమాట.

కనుక ఈరోజుల్లో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా నిజాయితీగా లౌకవాదానికి కట్టుబడి ఉండటం ఎంత కష్టమో అర్ధమవుతోంది. కానీ ఉండగలిగితే అది చాలా గొప్ప విషయమే అవుతుంది. అయితే మన రాజకీయ నాయకులు, వారి పార్టీలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నా లేకపోయినా మన దేశంలో మెజార్టీ ప్రజలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నారని చెప్పవచ్చు. అది మన దేశం గొప్పదనం అనుకోవచ్చు లేదా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే మన నేతల అదృష్టం అనుకోవచ్చు.


Related Post