కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు: విజయశాంతి

December 21, 2019


img

సిఎం కేసీఆర్‌ వరుసగా 2వసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి తనదైనశైలిలో స్పందిస్తూ తన ఫేస్‌బుక్‌లో పేజీలో ఈ రెండు మెసేజ్‌లు పోస్ట్ చేశారు.

“టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కెసిఆర్ గారి పాలన గురించి చెప్పాలంటే .. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆర్థికంగా చాలా బలిమితో ఉందని... ముఖ్యమంత్రి దొరగారు, ఆయన కుటుంబం అంతకన్నా ఎక్కువ కలిమితో ఉన్నారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి... ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా డబ్బుల్ని వాడాలని సీఎం కేసీఆర్ గారు సూచించే స్థాయికి దిగజార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్న కేసీఆర్ గారు.... సీఎంగా తాను చేస్తున్న దుబారా ఖర్చులను ఏ మేరకు తగ్గించారో వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజల సెంటిమెంట్లతో కూడిన అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని.. వాటి ద్వారా కెసిఆర్ గారు తాను చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన చేసుకోవాలని కలలు కంటున్నారు.

ప్రభుత్వ ఖజానాను ముంచేసి, ఇంతకాలం మాయమాటలు చెప్పిన సీఎం దొరగారు... ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిజాలను ఒప్పుకోక తప్పలేదు. అదేవిధంగా ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి కెసిఆర్ గారు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడి... ఆయన అసలు స్వరూపం వెలుగులోకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. ఆరోజు కోసమే తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారు. టిఆర్ఎస్‌కు పోటీగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి సైతం తట్టుకోలేకపోతున్నాయని హుజూర్‌నగర్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోంది.

‘‘అభివృద్ధి పేరుతో ఇంతకాలం గారడీ చేసిన సీఎం కేసీఆర్.. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెను కారణంగా చూపించి చార్జీలు పెంచారు. నిత్యావసర వస్తువుగా ఉన్న పాల ధరను కూడా పెంచారు. ఇవి చాలవని ఇప్పుడు కరెంటు చార్జీలను కూడా అమాంతంగా పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కల్వకుంట్ల కుటుంబం చేసిన దుబారా ఖర్చులకు ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచి, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితిలో సీఎం దొరగారు ఉన్నారు. ఓవైపు దుబారా ఖర్చులు చేస్తూ... మరోవైపు ఇష్టానుసారంగా అప్పులు చేస్తే, ఆ భారం సామాన్యుడి మీద పడుతుందని ప్రతిపక్షాలు పలుసార్లు హెచ్చరించినపుడు, వారిపై కేసులు పెడతానని కేసీఆర్ గారు బెదిరించారు. గతంలో టిఆర్ఎస్ పాలకులు చేసిన పాపం ఇప్పుడు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందన్న విషయం అందరికీ బోధపడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వాలకాన్ని చూస్తుంటే.. రాబోయే రోజుల్లో సామాన్యులు రోడ్డు మీదకు వచ్చి నడిచినా డబ్బులు వసూలు చేస్తే తప్ప, ప్రభుత్వాన్ని నడపలేమని చేతులెత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీన్నే కేసీఆర్ గారి పరిభాషలో బంగారు తెలంగాణ అంటారేమో?’’ 

విజయశాంతి

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్


Related Post