పౌర జ్వాలలకు కాంగ్రెస్‌ ఆజ్యం...తెరాసకు సెగలు

December 21, 2019


img

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సెగలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూడా వ్యాపిస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మసీదులలో మధ్యాహ్నం ప్రార్ధనల అనంతరం భారీ సంఖ్యలో ముస్లింలు రోడ్లపైకి వచ్చి త్రివర్ణ పతాకాలు పట్టుకొని సీఏఏను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్‌ పాతబస్తీ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్ల తదితర ప్రాంతాలలో ముస్లింలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. కేంద్రప్రభుత్వం తక్షణమే సీఏఏను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అయితే వారు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు.

పాతబస్తీలో ర్యాలీ కారణంగా కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ర్యాలీని అడ్డుకొని కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పాతబస్తీలో ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులు “తెలంగాణలో సీఏఏను అమలుచేయబోమని సిఎం కేసీఆర్‌ ప్రకటించాలని” కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. 

దేశంలో పలురాష్ట్రాలు సీఏఏ ఆందోళనలతో అట్టుడికిపోతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఆందోళనకారులు శాంతియుత ప్రదర్శనలకే పరిమితం కావడం వలన ప్రభుత్వానికి, పోలీసులకు పెద్దగా ఇబ్బంది కలుగలేదనే భావించవచ్చు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తెరాస వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అలాగని రాష్ట్రంలో మొదలైన ఈ ఆందోళనలను కొనసాగనిస్తే తెరాస సర్కార్‌కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. 

కాంగ్రెస్ పార్టీ కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున రాష్ట్రంలో మొదలైన ఈ ఆందోళనలకు మద్దతు ప్రకటించింది. జగిత్యాలలో నిన్న జరిగిన సీఏఏ నిరసన ర్యాలీకి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  సంఘీభావం తెలుపడమే అందుకు తాజా నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ ఆందోళనకారులకు మద్దతునీయడం ద్వారా తమను రాజకీయంగా దెబ్బ తీసిన తెరాసపై ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటే ఆశ్చర్యపోనవసరం లేదు.  కనుక తెరాస సర్కార్‌ రాష్ట్రంలో ఈ ఆందోళనలను వీలైనంత త్వరగా నిలిపివేయవలసి ఉంటుంది లేదా అదుపు తప్పకుండా నియంత్రించుకోవలసి ఉంటుంది.


Related Post