అశ్వధామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షాక్

December 21, 2019


img

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వధామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆరు నెలలు శలవు కావాలంటూ ఆయన పెట్టుకొన్న దరఖాస్తును తిరస్కరించింది. తీవ్ర నష్టాలలో ఉన్న ఆర్టీసీని కాపాడుకొనేందుకు ఆర్టీసీ కార్మికులందరూ కలిసికట్టుగా మరింత కష్టపడిపనిచేయాల్సి ఉందని, కనుక అశ్వధామరెడ్డికి 6 నెలలు శలవు మంజూరు చేయలేమని ఆర్టీసీ యాజమాన్యం తెలియజేసింది. కనుక అశ్వధామరెడ్డి వెంటనే విధులలో చేరాలని ఆదేశించింది. 

దీంతో అశ్వధామరెడ్డి తపనిసరిగా విధులలో చేరడమో లేదా ఉద్యోగానికి రాజీనామా చేయకతప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అశ్వధామరెడ్డి వంటి యూనియన్ నేతలే ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సమ్మె మొదలుపెట్టించారని సిఎం కేసీఆర్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. కనుక విధులలో చేరితే ఆర్టీసీ యాజమాన్యం వేధింపులకు పాల్పడుతుందనే భయంతోనే అశ్వధామరెడ్డి శలవు కోరి ఉండవచ్చు. పైగా ఆర్టీసీలో యూనియన్లకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరికలు, ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేయడం, వాటికి బదులు ఆర్టీసీ సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేస్తుండటంతో అశ్వధామరెడ్డి ఆర్టీసీలో ఒంటరి అయిపోయారు. 

48,000 మంది ఆర్టీసీ కార్మికులను 55 రోజులు కలిసికట్టుగా నిలిపి సమ్మె చేయించిన అశ్వధామరెడ్డి ఇప్పుడు ఆర్టీసీలో ఇలా ఒంటరిగా మిగిలిపోవడం చాలా ఆశ్చర్యకరమే. సమ్మె సమయంలో ప్రభుత్వాన్ని గడగడలాడించిన అశ్వధామరెడ్డి ఇప్పుడు శలవు పేరుతో పారిపోవాలనుకోవడం ఇంకా ఆశ్చర్యకరమే. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఆయన ఆర్టీసీలో ఉద్యోగం చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి కనుక రాజీనామా చేయడం మినహా ఆయనకు మరో దారి కనిపించడం లేదు. ఒకవేళ ఉద్యోగానికి రాజీనామా చేస్తే తన ఉనికిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్‌ లేదా బిజెపిలో చేరి ప్రభుత్వంతో పోరాటాలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 



Related Post