కాబ్ ఆందోళనపై కిషన్‌రెడ్డి స్పందన

December 20, 2019


img

పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)ను వ్యతిరేకిస్తూ అనేక రాష్ట్రాలలో ఉదృతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అనేకచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండటంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేయకతప్పడం లేదు. ముఖ్యంగా రాజధాని డిల్లీలో, యూపీ, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు నానాటికీ తీవ్రం అవుతున్నాయి. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వాటిపై స్పందిస్తూ, “ ఆందోళనకారులలో చాలామందికి అసలు ఆ చట్టంలో ఏముందో కూడా తెలుసుకోకుండానే ఆందోళనలలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా యువత ఆ చట్టం గురించి పూర్తిగా తెలుసుకొని దానిపై తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేస్తే వినేందుకు కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉంది. ఏవైనా లోపాలున్నట్లయితే సవరించుకోవడానికి కూడా సిద్దంగా ఉన్నాము. 

మన పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో తీవ్ర వివక్ష, నిరాధారణకు గురై మన దేశంలో ఆశ్రయం కోరి వచ్చిన, వస్తున్న హిందూ, క్రీస్టియన్, సిక్కులు తదితరులను ఆదరించి, అక్కున చేర్చుకొని వారికి మన పౌరసత్వం కల్పించడం కోసమే ఈ చట్టం ఉద్దేశ్యించబడింది తప్ప దీనితో దేశంలో ఏ కులం, మతం, ప్రాంతం, బాష, సంస్కృతిలకు చెందిన ప్రజలకు నష్టం జరుగదు. అలాగే ఏ సంస్థలు, వ్యవస్థలకు కూడా నష్టం జరుగదు. కానీ కాంగ్రెస్ పార్టీతో సహా కొన్ని పార్టీలు దీనిపై అనవసర రాద్దాంతం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ప్రజల మద్య మతవిద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నాయి. 

ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో చెప్పలేకపోతున్నాయి. కనుక రాజకీయ ప్రయోజనాల కోసమే ఆందోళనలు చేస్తున్నట్లు భావించకతప్పదు. పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నవారే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని నేను భావిస్తున్నాను. మోడీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధిపదంలో దూసుకుపోతుంటే ఓర్వలేని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మా ప్రభుత్వంపై బురద జల్లడానికే వెనుకనుంచి ఈ ఆందోళనలను ప్రోత్సహిస్తున్నాయి. 

మన దేశంలో అనాదిగా విదేశీశరణార్దులకు ఆశ్రయం కల్పిస్తోంది. గతంలో మనం లక్షలాదిమంది శ్రీలంక తమిళ శరణార్దులను ఆదరించి అక్కున చేర్చుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు? పొరుగు దేశాలలో తీవ్ర వివక్షను, అవమానాలను భరించలేక, అక్కడ బ్రతకలేక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మనదేశానికి వచ్చి రోడ్లపక్కన, రైల్వే ప్లాట్ ఫారంలపైనా దయనీయజీవితాలు వెళ్ళదీస్తున్న వారిని ఆదుకోవడం మన ధర్మం కాదా? వారిపట్ల మానవత్వంతో స్పందించవలసిన తరుణంలో ఈ విద్వేషాగ్ని ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం?

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దేశ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న ఈ ఆందోళనలు మానుకొంటే మంచిది. కాదని ఆందోళనల పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోదని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు. 


Related Post