చివరికి ఏపీ ఏమవుతుందో?

December 20, 2019


img

తెలంగాణతో సహా దేశవిదేశాలలో కూడా ఆంధ్రాకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వివిద రంగాలలో నిపుణులు గొప్ప గొప్ప పరిశ్రమలు, వాణిజ్యసంస్థలు స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. సినీ, విద్యా, వైద్య, ఐ‌టి తదితర రంగాలలో ఆంధ్రావాళ్ళదే పైచేయి. రాష్ట్రావిభజన జరిగేవరకు కూడా ఆంధ్రా, రాయలసీమ నేతలే తిరుగులేని అధికారం చలాయించారు. కనుక రాష్ట్రావిభజన తరువాత వారందరి తెలివితేటలు, మేధాశక్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే అది అత్యాశ కాబోదు. కానీ జరిగిందేమిటో అందరూ చూశారు. ఇప్పుడు జరుగుతున్నదీ అందరూ చూస్తున్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధి చేసి చూపిన చంద్రబాబునాయుడు అమరావతిని దానికి ధీటుగా నిర్మించి చూపిస్తారనుకొంటే మూడేళ్లు సింగపూర్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి, మిగిలిన రెండేళ్ళు మోదీతో యుద్ధం చేయడానికే సరిపోయింది. చివరికి రాజధాని గ్రాఫిక్స్ మాత్రమే మిగిలాయి. 

కనుక ఏపీ ప్రజలు చంద్రబాబును పక్కన పెట్టి ఒకసారి జగనన్నకు అవకాశం ఇచ్చి చూద్దాం అనుకొని భారీ మెజార్టీతో పట్టం కట్టారు. కానీ ఆయన సిఎం కుర్చీలో కూర్చోన్నప్పటి నుంచి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో సంబందం లేకుండా రోజుకో వరం చొప్పున ప్రకటించుకొంటూ, గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను తిరగదోడుతుండగానే ఆరు నెలలు గడిచిపోయాయి. పగ్గాలు చేపట్టగానే రాజధాని నిర్మాణపనులు నిలిపేశారు. పోలవరం రివర్స్ గేర్ వేశారు. ఆరు నెలలు తరువాత ఇప్పుడు తాపీగా ఏపీకి ఒకటి కాదు మూడు రాజధానులు కట్టాలనుకొంటునట్లు బాంబు పేల్చారు. దాంతో ఏపీలో అభివృద్ధికి బదులు రాజకీయ విస్పోటనం జరిగింది. 

ఇవి సరిపోవన్నట్లు రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు కమిటీ నివేదికను శుక్రవారం ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి అందజేసింది. దానిలో పేర్కొన్న సలహాలను, సూచనలను చూస్తే ఎవరికైనా గుండె గుబేలు మనకమానదు. 

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులు అని ప్రతిపాదిస్తే, జిఎన్ రావు కమిటీ అమరావతి, విశాఖ రెండు నగరాలలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని, కర్నూలులో హైకోర్టు, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని, సిఎం క్యాంప్ కార్యాలయం, సచివాలయం విశాఖలో ఏర్పాటు చేయాలంటూ సలహాలు ఇచ్చింది. ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇప్పుడు జిఎన్ రావు కమిటీ నివేదిక అగ్నికి ఆజ్యం పోసినట్లుంది. 

కనుక ఈ వ్యతిరేకతను, రాజకీయాలను, ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటూ, మూడు రాజధానుల నిర్మాణాలకు నిధులు సమకూర్చుకొని జగన్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఎప్పటిలోగా ఆచరణలో పెడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆలోగా పుణ్యకాలం పూర్తయిపోయి మళ్ళీ ఏపీలో టిడిపి అధికారంలోకి వస్తే మళ్ళీ ‘అమరావతి కధలు’ మొదలవుతాయని వేరే చెప్పక్కరలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మొదలుపెట్టబోయే ఆ పనులన్నీ అప్పుడు అటకెక్కడం ఖాయం. అంటే కధ మళ్ళీ మొదటికొస్తుందన్న మాట!

ఇంతమంది మేధావులు, నిపుణులు, గొప్ప రాజకీయ, పరిపాలానానునుభవం ఉన్న నేతలు, అధికారులు, అపారమైన సహజ వనరులు, మానవ వనరులు అన్నీ ఉండి కూడా ఏపీని అభివృద్ధి చేసుకోలేకపోవడం ఆశ్చర్యం, బాధ కలిగిస్తుంది. కానీ కర్రున్నవాడిదే బర్రె కనుక ఏపీ ప్రజలందరూ కళ్ళ ముందు జరుగుతున్నవి ప్రేక్షకులలాగ చూస్తూ కాలక్షేపం చేయకతప్పదు. ఈ పరిణామాలన్నిటినీ చూస్తుంటే చివరికి ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? ఎప్పటికైనా రాజధాని నిర్మించుకోగలుగుతారా? ఎప్పటికైనా ఏపీ అభివృద్ధి చెందుతుందా లేక ఎప్పటికీ ఈ రాజకీయాలతోనే గడిచిపోతుందా? అనే భయం, ఆందోళన కలుగకమానదు.


Related Post