దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలోని ఉన్నావ్ హత్యాచార ఘటనలో దోషిగా నిర్ధారింపబడిన బిజెపి మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌కు జీవితఖైదు విధిస్తున్నట్లు డిల్లీ హైకోర్టు శుక్రవారం తుది తీర్పు చెప్పింది. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.15 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి భవిష్యత్‌లో సెంగర్ అనుచరుల వలన ఎటువంటి భయం, ప్రమాదం లేకుండా జీవించేందుకు వీలుగా సురక్షితమైన ప్రదేశంలో నివాసం కల్పించాలని సిబిఐని ఆదేశించింది.
ఈ కేసులో బాధితురాలిపై సెంగర్ అత్యాచారం చేయగా, ఆమె కోర్టుకు వెళుతున్నప్పుడు రెండుసార్లు హత్యా ప్రయత్నాలు చేశారు. ఆమె ఈ ఏడాది జూలై 28న కారులో కోర్టుకు వెళుతుండగా ఒక లారీ వచ్చి దానిని డ్డీకొంది. ఆ ప్రమాదంలో ఆమె ప్రాణాలతో బయటపడింది కానీ ఆమెతో కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరో మహిళలు ఘటనాస్థలంలోనే చనిపోయారు.
ఇటీవల బాధితురాలు ఒంటరిగా రాయ్ బరేలీలోని కోర్టుకు వెళుతున్నప్పుడు సెంగార్ అనుచరులుగా భావింపబడుతున్న కొందరు వ్యక్తులు కాపు కాసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. 90 కాలిన గాయాలతో ఆమె మరణించింది. సెంగార్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు అతనిపై చర్య తీసుకోలేదు పైగా బాధితురాలి తండ్రి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ అరెస్ట్ చేశారు. మరుసటి రోజున పోలీస్‌స్టేషన్‌లో ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ అత్యాచారానికి, హత్యలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సెంగారే కారకుడని అర్ధమవుతూనే ఉంది. అతని వలన పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని పార్టీ నుంచి బహిష్కరించి బిజెపి చేతులు దులుపుకొంది.
అత్యాచారం కేసులలో సామాన్య నేరస్తులకు ఉరిశిక్షలు విధిస్తున్న న్యాయస్థానాలు ఉన్నావ్ భాదితురాలిపై అత్యాచారం చేసి, ఇంతమంది చావులకు కారణం అయిన సెంగార్‌కు జీవితఖైదుతో సరిపెట్టడం విస్మయం కలిగిస్తోంది. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఒక విధంగా లేనివారికి మరొకవిధంగా శిక్షలు విధిస్తుండటం బాధాకరం.
నేటికీ బాధితురాలి కుటుంబ సభ్యుల భద్రతకు భరోసాలేదని కోర్టు ఆదేశాలతోనే స్పష్టం అవుతోంది. అయినా నేరస్తులను కటినంగా శిక్షించలేకపోవడాన్ని ఏమనుకోవాలి?