ఉద్యోగులను తొలగించేందుకే ఆ ప్రయత్నాలు?

December 20, 2019


img

55 రోజులు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులను బేషరతుగా ఉద్యోగాలలో తీసుకొని, వారు సంతోషంగా పని చేసుకొనేందుకు తగిన వాతావరణం కల్పిస్తానని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వారు అడగకుండానే ఇంకా అనేక వరాలు కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డ్యూటీలలో చేరిన మరుసటిరోజు నుంచే డిపో మేనేజర్లు ‘యూనియన్లు వద్దంటూ’ పత్రాలపై సంతకాల కోసం బలవంతం చేయడం మొదలుపెట్టారని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

మహిళా కండక్టర్ల ఇబ్బందులు, భద్రతను దృష్టిలో పెట్టుకొని వారు రాత్రి 8 గంటలలోగా ఇళ్లకు చేరుకొనేలా డ్యూటీలు వేయాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించడంతో, డిపో మేనేజర్లు వారికి తెల్లవారుజామున 4-4.30 గంటలలోపు మొదలయ్యే మొదటి బస్‌సర్వీస్ డ్యూటీలు వేస్తున్నారు. కానీ ఆ సమయంలో మహిళా ఉద్యోగులు డ్యూటీకి ఎలా హాజరవగలరు?అని అధికారులు ఆలోచించడం లేదు. చీకటి పడకుండా ఇళ్లకు చేరుకోవాలంటే తెల్లవారుజామునే డ్యూటీలకు హాజరుకాక తప్పదని చెపుతున్నారు. అప్పుడు వస్తేనే మధ్యాహ్నం 2-3 గంటలకు డ్యూటీలు పూర్తి చేసుకొని ఇళ్లకు చేరుకోవచ్చునని చెపుతున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు డ్యూటీతో పాటు ఇంటి పనులు కూడా చేసుకోక తప్పదని అందరికీ తెలుసు. అంతా తెల్లవారుజామునే బస్సులో ఉండాలంటే ఇక వంట ఎప్పుడు చేసుకోవాలి? మధ్యాహ్నం భోజనం ఎలాగ? పిల్లలను సిద్దం చేసి స్కూళ్ళు, కాలేజీలకు ఎవరు పంపుతారు? అని మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7-8 గంటలకు డ్యూటీలు వేయాలని కోరుతున్నారు.   

ఆర్టీసీ డ్రైవర్లలో కొంతమంది మద్యం సేవించి డ్యూటీలకు హాజరవుతారనే పిర్యాదులు చాలా కాలంగా వినిపిస్తున్నాయి కానీ వాటి గురించి ఆర్టీసీ యాజమాన్యం పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు. కానీ సమ్మె విరమించి అందరూ డ్యూటీలలో చేరిన తరువాత డ్రైవర్లందరికీ రోజూ ఉదయం డ్యూటీలలో చేరే ముందు వారికి అధికారులు బ్రీత్ అనలైజర్లతో పరీక్షలు చేస్తున్నారు.

దానిని ఎవరూ వ్యతిరేకించడం లేదు కానీ పనిచేయని పాత బ్రీత్ అనలైజర్లతో టెస్టులు చేసి, తాగివచ్చారని ఆరోపిస్తూ తమను సస్పెండ్ చేస్తున్నారని ఆర్టీసీ డ్రైవర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 70 మందిని సస్పెండ్ చేసినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. డిపోల వద్ద బ్రీత్ అనలైజర్ల పరీక్షలో త్రాగినట్లు చెప్పబడుతున్న డ్రైవర్లు వెంటనే సమీపంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి అక్కడి బ్రీత్ అనలైజర్లతో పరీక్షింపజేసి చూసుకోగా అందులో మద్యం సేవించలేదని చూపిస్తోందని తెలిపారు. ఏదో సాకుతో తమను ఉద్యోగాలలో నుంచి తొలగించడానికే ఆర్టీసీ యాజమాన్యం ఈవిధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెండ్ చేయబడిన ఆర్టీసీ కార్మికులందరినీ తక్షణం విధులలోకి తీసుకోవాలని కోరుతూ మంచిర్యాల డిపో ముందు శుక్రవారం ఉదయం ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.


Related Post