తెరాస-బిజెపి ఫైట్స్ లో నిజమెంత?

December 20, 2019


img

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెరాస-బిజెపిలు రాజకీయ శత్రువులలాగే వ్యవహరిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం- కేంద్రప్రభుత్వాల మద్య మంచి సఖ్యత కొనసాగుతోంది. రాజకీయాలు వేరు..పాలనాపరమైన సహకారం వేరు అని రెండు పార్టీలు చెప్పుకొంటుంటాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలలో బారీగా అవినీతి జరుగుతోందని రాష్ట్ర బిజెపి నేతలు విమర్శిస్తుంటే, ఆ పధకాల స్పూర్తితో దేశమంతటా అటువంటి పధకాలే అమలుచేస్తామని కేంద్రమంత్రులు చెపుతుంటారు. అవే పధకాలకు కేంద్రప్రభుత్వం అవార్డులు కూడా ఇస్తుంటుంది. దాంతో రాష్ట్ర బిజెపి నేతల విమర్శలు, ఆరోపణలకు అర్ధం లేకుండాపోతోంది కనుక వాటిని ఎవరూ నమ్మడం లేదు. 

పైగా తెరాస-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్‌ వాదనలను ప్రజలు నమ్ముతుండటంతో రాష్ట్ర బిజెపి నేతలు తలలు పట్టుకొంటున్నారు. ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే వాదన వలన ఎన్నికలలో బిజెపియే మూల్యం చెల్లిస్తోంది తప్ప తెరాస కాదు కనుక ఆ వాదనలను గట్టిగా ఖండించకుండా ఆ ఆనుమానాలను తెరాస పెంచిపోషిస్తోంది కూడా. తెరాస సర్కార్‌పై బిజెపి నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తెరాస స్పందించకపోవడం కూడా అందుకేనని భావించవచ్చు. 

కానీ రాష్ట్ర బిజెపి నేతలు మరీ రెచ్చిపోయి విమర్శలు చేసినప్పుడు మాత్రమే తెరాస స్పందిస్తుంటుంది. అది కూడా కేంద్రంతో యుద్దం చేస్తున్నట్లు కాక ఆత్మరక్షణ చేసుకొంటున్నట్లుగానే ఉంటుంది. తెలంగాణలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిన తెరాసకు 2వ స్థానం కోసం పోటీ పడుతున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో కొట్లాడవలసిన అవసరమే లేదు. కానీ తెరాస స్పందించినా...స్పందించకపోయినా ఆ రెండు పార్టీలు తమ ఉనికిని చాటుకొనేందుకు తెరాస సర్కార్‌తో యుద్ధం చేయకతప్పదు. కనుక పౌరసత్వ సవరణ చట్టంకు పార్లమెంటులో తెరాస మద్దతు ఇవ్వకపోవడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ స్పందిస్తూ, “తెరాస పాకిస్తాన్ పార్టీ వంటిది. అందుకే ఆ బిల్లుకు మద్దతు ఇవ్వలేదు,” అంటూ విమర్శలు గుప్పించారు. 

నిజానికి ఈ విమర్శలపై తెరాస స్పందించకపోయినా పరువాలేదు. కానీ దీనిపై రాష్ట్రంలో ముస్లింలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కనుక ఈ అంశంపై గట్టిగా మాట్లాడితే వారిని ప్రసన్నం చేసుకోవచ్చనే ఆలోచన ఉండి ఉండవచ్చు. అందుకే తెరాస ఫైర్ బ్రాండ్ లీడర్ కర్నె ప్రభాకర్ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనుక తెరాస-బిజెపిల మద్య జరుగుతున్న మాటల యుద్ధాలు నిజమైనవేనా కాదా? అనే అనుమానం కలుగడం సహజం.


Related Post