తెరాస ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

December 19, 2019


img

తెరాస ఎమ్మెల్యే గొంగిడి సునీతకు గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ్ళ ఆమె తన ఆలేరు నియోజకవర్గంలోని రోడ్లు మరియు భవనాల శాఖ అతిధి గృహంలో స్థానిక సర్పంచులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా, స్లాబు నుంచి పెద్ద పెచ్చు ఊడి ఆమె పక్కనే కూర్చొని ఉన్న గొలనుగొండ సర్పంచ్ లక్ష్మి తలపై పడింది. దాంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. వెంటనే ఆమెను కారులో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే సునీత తృటిలో తప్పించుకొన్నప్పటికీ ఆమెకు, పక్కనే కూర్చొని ఉన్న మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇందిరకు స్వల్ప గాయలయ్యాయి. 

రోడ్లు, భవనాలను నిర్మించే శాఖకు చెందిన అతిధి గృహం పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే ఇంక రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ భవనాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీ భవనాలు శిధిలావస్థకు చేరుకొని ఈవిధంగా కూలిపోయిన వార్తలు తరచూ చూస్తూనే ఉంటాము. కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తుంటారు తప్ప సమస్య తీవ్రతను గుర్తించరు. పైగా అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ఇకనైనా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ భవనాలను, ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీలను తనికీలు చేయించి అవసరమైన మరమత్తులు చేయిస్తే ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నివారించవచ్చు.


Related Post