నిర్భయకేసులో మరో ట్విస్ట్...న్యాయవాదికి జరిమానా!

December 19, 2019


img

నిర్భయకేసులో నేడు మరో అనూహ్యపరిణామం జరిగింది. దోషుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్‌కు డిల్లీ హైకోర్టు రూ.25,000 జరిమానా విధించింది. నలుగురు దోషులలో ఒకడైన పవన్ కుమార్ గుప్తా తరపున ఆయన ఇవాళ్ళ డిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నిర్భయ అత్యాచారం జరిగిన సమయానికి పవన్ కుమార్ గుప్తా మైనర్ అని, కానీ అతని వయసును పరిగణనలోకి తీసుకోకుండా పోలీసులు కేసు నమోదు చేశారని కనుక అతని వయసు నిర్ధారణకు వైద్య పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏడేళ్ళపాటు సుదీర్గంగా విచారణ జరిపిన తరువాతే న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించి ఉరిశిక్షలు విధించిందని, కానీ వారికి ఉరిశిక్షలు అమలుకాకుండా సాగదీసేందుకే ఏపీ సింగ్ ఈవిధంగా రోజుకో పిటిషన్ వేస్తూ చిత్రవిచిత్రమైన వాదనలతో విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన డిల్లీ హైకోర్టు, పవన్ కుమార్ గుప్తా పిటిషన్‌ను కొట్టివేయడమే కాక ఏపీ సింగ్‌కు రూ.25,000 జరిమానా విధించింది. ఈ కేసులో అనైతికంగా వ్యవహరిస్తున్నందుకు ఆయనపై బార్ అసోసియేషన్ కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో ఆయన మిగిలిన ఇద్దరు దోషుల తరపున మళ్ళీ పిటిషన్లు వేసే సాహసం చేస్తారో లేదో చూడాలి.


Related Post